హాత్..సాత్..! కాంగ్రెస్ రెండో జాబితాలో ఏడుగురు అభ్యర్థుల ఖరారు
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఏడు సెంగ్మట్లకు అభ్యర్థులను
దిశ, వరంగల్ బ్యూరో : ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఏడు సెంగ్మట్లకు అభ్యర్థులను ఖరారు చేస్తూ శుక్రవారం రాత్రి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ జాబితాను విడుదల చేశారు. వరంగల్ తూర్పు అభ్యర్థిగా కొండా సురేఖ, మహబూబాబాద్ అభ్యర్థిగా డాక్టర్ మురళీనాయక్, పరకాల అభ్యర్థిగా రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వర్ధన్నపేట అభ్యర్థిగా కేఆర్ నాగరాజు, వరంగల్ పశ్చిమ అభ్యర్థిగా నాయిని రాజేందర్‌రెడ్డి, పాలకుర్తి అభ్యర్థిగా యశస్విని రెడ్డి, జనగామ అభ్యర్థిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిలకు అవకాశం కల్పించారు. ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో ఇంకా అధికారికంగా చేరకుండానే రేవూరికి టికెట్ రావడం గమనార్హం. ఇక భారత పౌరసత్వం రాకపోవడంతో పాలకుర్తి నుంచి బరిలో దిగాలని భావించిన ఝాన్సీరెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. అయితే మొదట్నుంచి పాలకుర్తిలో పార్టీకి వేవ్ తీసుకురావడంతో ఆమె విజయవంతమైంది. ఝాన్సీరెడ్డికి బదులుగా ఆమె సొంత కోడలు మామిడాల యశస్విని రెడ్డికి టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరడంతో అందుకు అధిష్ఠానం సమ్మతించడం విశేషం. పరకాల, పాలకుర్తి సెగ్మంట్లలో ఇద్దరి పేర్లు కొద్ది రోజుల క్రితం నుంచే తెరపైకి రావడం.. అధిష్ఠానం సానుకూలంగా స్పందించడం చకచక జరిగిపోవడం గమనార్హం.
ఏడు స్థానాలపై వీడిన పీటముడి...
వరంగల్ తూర్పు, జనగామ, మహబూబాబాద్, వర్ధన్నపేట, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలపైనా ఉత్కంఠ వీడినట్లయింది.మాజీమంత్రి కొండా సురేఖ మొదట్నుంచి వరంగల్ తూర్పు నుంచే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతూ వచ్చారు. అయితే ఆమెను పరకాల నుంచి పోటీ చేయించే ప్రయత్నాలు జరిగినా, పార్టీలోకి ఆశావహులు వచ్చే అవకాశాలు ఆమె పోటీ చేసే స్థానంపై ప్రభావం చూపే అవకాశం ఉందని పలు ఊహాగానాలు వినిపించినా.. చివరికి ఆమె కోరుకున్నట్లుగానే వరంగల్ తూర్పు టికెట్ దక్కింది. జనగామలో కొద్దిరోజుల క్రితం వరకు మాజీ మంత్రి, పొన్నాల లక్ష్మయ్యతో టికెట్ పోరు కొనసాగగా, ఆయన బీఆర్ ఎస్‌లోకి వెళ్లిపోవడంతో కొమ్మూరికి టికెట్ విషయంలో పోటీ లేకుండాపోయింది. అయితే మొదటి జాబితాలో కాకుండా రెండో జాబితా వరకు ఆయన వెయింట్ చేయాల్సి వచ్చింది.అయితే ఇప్పటికే కొమ్మూరి ప్రచారం మొదలుపెట్టారు. తాజాగా రెండో జాబితాలో ఆయనకు పార్టీ టికెట్ కేటాయించడంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. వర్ధన్నపేట టికెట్ మొదట్నుంచి కేఆర్ నాగరాజుకేనంటూ పార్టీ ముఖ్యనేతల నుంచి వాయిస్ వినిపించింది. అందుకు అనుగుణంగానే ఆయన ప్రచారం చేపట్టడం, సర్వే అంశాలు సానుకూలంగా ఉండటంతో అభ్యర్థిగా అవకాశం కల్పిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. మహబూబాబాద్ టికెట్ విషయంలో మాజీ కేంద్ర సహాయమంత్రి పోరిక బలరాంనాయక్‌కు మురళీనాయక్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే పార్టీ చివరికి మురళీనాయక్‌కే అవకాశం కల్పించడం విశేషం. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో జంగా, నాయినిల మధ్య టికెట్ పోరు తీవ్ర స్థాయిలో కొనసాగింది. అయితే గతంలో పార్టీ అధిష్ఠానం సూచన మేరకు వరంగల్ పశ్చిమ టికెట్‌ను ఉమ్మడి అభ్యర్థికి త్యాగం చేసిన విషయాన్ని గుర్తెరిగి ఈసారి నాయినికి అభ్యర్థిగా అవకాశం కల్పించినట్లుగా తెలుస్తోంది. జంగాను కన్విన్స్ చేయడం అనేది ఇప్పుడు పార్టీ పెద్దల ఎదుట ఉన్న టాస్క్‌గా నేతలు చెబుతున్నారు.
అధికార పార్టీతో ఇక ప్రచార యుద్ధమే..!
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 12 నియోజకవర్గాలకు అధికార పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ సైతం డోర్నకల్ మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులను డిక్లేర్ చేయడంతో రెండు ప్రధాన పార్టీల మధ్య అసలు రాజకీయం ఇప్పుడు మొదలు కానుంది. అభ్యర్థుల ప్రకటన వెలువడిన నేపథ్యంలో ప్రచారం ఊపందుకోనుంది. ఇప్పటికే ప్రకటించిన నాలుగు స్థానాలైన నర్సంపేట, ములుగు, భూపాలపల్లి,స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో అధికార పార్టీకి ధీటుగా కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తాజాగా ప్రకటించిన ఏడు స్థానాల్లోనూ పొలిటికల్ హీట్ పెరగనుంది. సరిగ్గా ఎన్నికలకు 35 రోజుల సమయం ఉండగా ప్రచారానికి 32 రోజుల వరకు అవకాశం ఉండనుంది. ఈసమయాన్ని ఎంతబాగా వినియోగించుకుంటారనే దానిపైనే అభ్యర్థుల విజయావకాశాలు ఉండనున్నాయి.
డోర్నకల్‌ను ఎందుకు ఆపినట్లు..!?
డోర్నకల్ నియోజకవర్గ అభ్యర్థి ఎంపికపై అధిష్ఠానం పెండింగ్ పెట్టడంపై అనుమానాలు నెలకొంటున్నాయి. ఈనియోజకవర్గంలో ప్రధానంగా రాంచంద్రునాయక్, మాలోతు నెహ్రూనాయక్, భూపాల్‌నాయక్‌ల పేర్లు వినిపిస్తూ వస్తున్నాయి. రాంచంద్రునాయక్, నెహ్రూనాయక్‌లతో అధిష్ఠానం పెద్దలు స్వయంగా మాట్లాడినట్లు సమాచారం. అయితే ఈనియోజకవర్గ అభ్యర్థి ఎంపికపై ఖమ్మం కాంగ్రెస్ నేత పొంగులేటి ప్రభావం ఉండోచ్చన్న చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో కీలక నేతల రాక కోసం ఏమైనా పెండింగ్ పెడుతున్నారా..? అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో కలుగుతుండటం గమనార్హం. పరకాల మాదిరిగానే అనుహ్యంగా ఏ నేతకోసమైనా వేచి చూసే ధోరణితో ఉన్నారా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
యశస్విని రెడ్డి :
కొండా సురేఖ :
కేఆర్ నాగరాజు :
మురళీనాయక్ :
కొమ్మూరి ప్రతాప్ రెడ్డి :
నాయిని రాజేందర్ రెడ్డి :
రేవూరి ప్రకాశ్ రెడ్డి :