Moranchapalli : మొరంచపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మతులకు మోక్షం
ఎట్టకేలకు మొరంచపల్లి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం మరమ్మతు పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది.
దిశ, వరంగల్ బ్యూరో : ఎట్టకేలకు మొరంచపల్లి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం మరమ్మతు పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేక చొరవతో రూ.34లక్షల నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు మరమ్మతు పనులకు మార్గం సుగమం అయినట్లయింది. 2023లో జులై 27న వరదలతో కకావికలమైన మొరంచపల్లి గ్రామం ఇప్పుడిప్పుడు కుదుటపడుతోంది. మొరంచవాగు వరదలతో ముంచెత్తడంతో అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పంట భూముల్లో ఇసుక మేటలతో సేద్యానికి పనికి రాకుండా పోయాయి. పంట భూములను యథాస్థితికి తీసుకువచ్చేందుకు రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు.
వరదల్లో మొరంచవాగు లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టం దెబ్బతినడంతో ఆయకట్టు రైతులు సాగునీరు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏడాదికి రెండు పంటలు పండించే రైతాంగం లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మతులకు చేరుకోవడం మూడు పంటల సాగుకు దూరంగా ఉండాల్సి వచ్చింది. కొంతమంది సాగు చేసినా నీరందక ఇబ్బందులు పడ్డారు. నీరందే మార్గం లేకపోవడంతో ఆయకట్టులో సాగు కూడా తగ్గుముఖం పట్టింది. అయితే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేక చొరవతో రాష్ట్ర ప్రభుత్వం రూ.34 లక్షలను మంజూరు చేసింది. ఎమ్మెల్యే గండ్ర సత్యానారాయణరావుకు గ్రామస్థులు, రైతులు కృతజ్జతలు చెబుతున్నారు.