విధి వంచించిన కుటుంబం..

ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్న నిరుపేద కుటుంబాన్ని విధి వంచించింది. ఆ దంపతులిద్దరూ కూలి పనులు చేసి పిల్లలను పోషించుకుంటున్నారు.

Update: 2025-01-04 09:08 GMT

దిశ, డోర్నకల్ : ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్న నిరుపేద కుటుంబాన్ని విధి వంచించింది. ఆ దంపతులిద్దరూ కూలి పనులు చేసి పిల్లలను పోషించుకుంటున్నారు. భార్య అనారోగ్యానికి గురై మరణించింది. కుమారుడికి ప్రమాదవశాత్తు వెన్నెముక విరిగి మంచానికి పరిమితమయ్యాడు. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రం యాదవనగర్ కు చెందిన కొదిరిపాక సత్యనారాయణ విజయలక్ష్మి దంపతులకు చంద్రశేఖర్, శిరీష ఇద్దరు పిల్లలు. చిన్న రేకుల ఇంట్లో నివసించేవారు. దంపతులిద్దరూ కూలి పనులు చేస్తూ పిల్లలను పోషించుకుంటున్నారు.

ఉన్నట్టుండి విజయలక్ష్మి అనారోగ్యానికి గురై మరణించింది. సత్యనారాయణ అనారోగ్య సమస్యలతో పుట గడవడం కష్టంగా మారడంతో కుమారుడు చంద్రశేఖర్ కుటుంబ బాధ్యతలు చూస్తూ భవన నిర్మాణ, వ్యవసాయ కూలీ పనులతో చెల్లి శిరీషను డిగ్రీ వరకు చదివించాడు. చెల్లి భవిష్యత్తుకు బాటలు వేయాలని తలంచిన అన్నయ్యను విధి చిన్నచూపు చూసింది. గత ఏడాది జులైలో ప్రమాదవశాత్తు ఇంటి పై నుంచి పడి వెన్నెముక విరిగి తీవ్ర గాయాల పాలయ్యాడు. దీంతో చెల్లెలు శిరీష తన అన్నను ఆస్పత్రిలో చేర్పించింది. చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో బాధితుడి స్నేహితులు, స్థానికులు చందాలు వేసి ఆర్థిక సహాయం చేశారు.

చివరికి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిన చంద్రశేఖర్ మంచానికి పరిమితమయ్యాడు. అయితే ఆహారం మొదలు మరుగుదొడ్డి వరకు చెల్లెలు శిరీష తల్లితండ్రై ఆలనా పాలనా చూస్తుంది. ఇటీవల మూత్రణాల సమస్య ఉత్పన్నమై ఖమ్మంలో ఆస్పత్రికి తరలించగా శాస్త్ర చికిత్స జరుపుటకు రూ.50,000 ఖర్చవుతుందని వైద్యులు చెప్పగా అప్పులు చేసి వైద్యం చేయించింది. ఇంటి బాధ్యతలు చూసే అన్నయ్య జీవచ్ఛవంలా మంచానికి పరిమితం కాగా, అటు అనారోగ్య సమస్యల (వయోభారం)తో బాధపడుతున్న తండ్రికి సేవలు వెరసి ఆ పేదింటి ఆడబిడ్డ(శిరీష)కు పుట్టెడు కష్టం వచ్చి పడింది. దీనికి తోడు ఆర్థిక పరిస్థితులు కృంగదీస్తున్నాయి. వీరికి 60 గజాల రేకుల ఇల్లు తప్ప.. మరే ఆస్తి లేదు. దాతలు సహాయం చేసి అన్నను ఆదుకోవాలని చెల్లెలు శిరీష దిశ ద్వారా వేడుకుంటుంది. 6281322394 నంబర్‌కు దాతలు గూగుల్‌ పే, ఫోన్‌ పే చేసి సహాయపడాలని వేడుకుంటుంది.


Similar News