రైతుల ద్రోహి కాంగ్రెస్.. మాజీ ఎమ్మెల్యే పెద్ది.సుదర్శన్ రెడ్డి..

మండల కేంద్రంలోని హై స్కూల్ సెంటర్లో రైతుభరోసా కుదింపు పై బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేసాయి. నిరసన కార్యక్రమంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది.సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.

Update: 2025-01-06 09:30 GMT

దిశ, నెక్కొండ : మండల కేంద్రంలోని హై స్కూల్ సెంటర్లో రైతుభరోసా కుదింపు పై బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేసాయి. నిరసన కార్యక్రమంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది.సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మార్పు మార్పు అంటూ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ రైతులను నయవంచన చేసిందని విమర్శించారు. రైతు డిక్లరేషన్ పేరుతో ఆర్ట్స్ కాలేజీ సాక్షిగా ప్రియాంక గాంధీ సమక్షంలో రైతు భరోసా ఎకరాకు 15 వేలు, రైతు కూలీలకు 12 వేలు, కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి సంవత్సరానికి పైగా అయినా ఇప్పటి వరకు రైతులకు నయాపైసా ఇవ్వక పోవడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పుడు ఎకరాకు 12 వేలు ఇస్తామని కేబినెట్ చెప్పడంతో కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడిందని ఎద్దేవా చేశారు.

తక్షణమే రైతులకు ఎకరాకు15 వేలు ఇవ్వాలని, లేని పక్షంలో ప్రజలు అడుగడుగునా కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎంపీలను నిలదీయాలని పిలుపునిచ్చారు. నర్సంపేట ఎమ్మెల్యే ఎన్నికల ముందు రైతు భరోసా పై ఇచ్చిన హామీని మరిచిపోయారని, ఇక్కడి ప్రజల గురించి, అభివృద్ధి గురించి నోరు విప్పడని ఎద్దేవా చేశారు. మేమొస్తే మార్పు వస్తదన్న ఎమ్మెల్యే దొంతి.. ఏడ బోయిండని అన్నారు. రైతు డిక్లరేషన్ పేరుతో దగా చేసిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులను గ్రామాల్లో తన్ని తరిమేసే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, ఇవ్వాల్టి నుంచి నిరసనలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సంగని.సూరయ్య, మాజీ ఎంపీపీ రమేష్ నాయక్, సొసైటీ అధ్యక్షుడు మారం.రాము, బానోతు.హరికిషన్, నాయకులు కొమ్ము.రమేష్ యాదవ్, కొమ్మా రెడ్డి రవీందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీలు సారంగపాణి, శ్రీనివాస్, వీరభద్రం, తోట సాంబయ్య, వాగ్యా నాయక్, కుమారస్వామి, రాజు, భూపాల్ తదితరులు పాల్గొన్నారు.


Similar News