కాకతీయ తోరణం తొలగింపు సరైంది కాదు : మాజీ ఎమ్మెల్యే పెద్ది
తెలంగాణ ప్రభుత్వ రాజ ముద్రలో కాకతీయ తోరణం తొలగింపు ఆలోచన సరైంది కాదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు
దిశ, నర్సంపేట: తెలంగాణ ప్రభుత్వ రాజ ముద్రలో కాకతీయ తోరణం తొలగింపు ఆలోచన సరైంది కాదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగంలో తెలంగాణ చిహ్నమైన కాకతీయుల చరిత్ర కలిగిన కాకతీయుల కళాతోరనాన్ని తొలగిస్తామని అనడం వరంగల్ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరచడమే అవుతుందన్నారు. తెలంగాణ చరిత్రకు ఆనవాళ్లు అయిన కాకతీయ కళా తోరణం, చార్మినార్ ను ప్రభుత్వ చిహ్నంలో తొలగిస్తామని అనడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనాలోచిత, అవగాహన రాహిత్యానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓరుగల్లు కళావైభవం కాకతీయుల చరిత్రను తుడిచివేసే విధంగా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ఈ జిల్లా చరిత్రను తుడిచేసే కుట్రలో మీరు బాగమవుతున్నారనే విషయం గుర్తించాలన్నారు. ఈ వ్యాఖ్యలను ముఖ్యమంత్రి వెనక్కి తీసుకోవాలని, వరంగల్ ప్రజలకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఓరుగల్లు జిల్లా నుంచి ఎన్నికైన కాంగ్రెస్ శాసనసభ్యులు అతని వాఖ్యలకు బాధ్యత వహించాలన్నారు. కాకతీయులు తవ్వించిన చెరువులను తుడిచేస్తరా, విద్వంసం చేస్తారా..? పాకాల చెరువును విద్వంసం చేస్తరా..యునెస్కో గుర్తించిన రామప్ప కట్టడాలను చరిత్రలో లేకుండా చేస్తరా..!! ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయాన్ని విద్వంసం చేస్తరా..? అని ప్రశ్నించారు.
అడుగడుగునా శివాలయాలను నిర్మించిన చరిత్ర కాకతీయ సామ్రాజ్యానిదని గుర్తు చేశారు. కాకతీయులు తెలంగాణ వరంగల్ లోనే తమ రాజ్యాన్ని పాలించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక, చత్తీస్గఢ్, మహారాష్ట్ర అనేక రాష్ట్రాల్లో కాకతీయుల పాలన కొనసాగిందన్నారు. కాకతీయుల పాలనను గొప్పదిగా కాంగ్రెస్ కేంద్ర నాయకులు అభి వర్ణించినట్లు గుర్తు చేశారు. కాకతీయ ఉత్సవాలు జరిపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, అది మరచిన రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పూర్తి అసంబద్ద మైనదన్నారు.
అందెశ్రీ గారు రాసిన "జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం" పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించారని దాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కానీ అదే పాటలో '' కాకతీయ కళా ప్రభల క్రాంతిరేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్" అంటూ వారు సంబోదించారని గుర్తు చేశారు. అలా సంబోధించిన గీతాన్ని రాష్ట్ర గీతంగా తీసుకున్నప్పుడు తెలంగాణ చరిత్రకు సాక్షాలైన కాకతీయ తోరణం, చార్మినార్ ను తొలగించాలనే నిర్ణయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనా విధానానికి, అవగాహన రాహిత్యానికి, పరిపక్వతకు అద్దం పడుతుందని ఎద్దేవా చేశారు. చరిత్రను తుడిచివేసే కుట్రను మేధావులు, ప్రజలు, విద్యావేత్తలు, యువత తిప్పి కొట్టాలన్నారు.