లలితా మహా త్రిపుర సుందరిగా భద్రకాళి అమ్మవారు

వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధి గాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఐదవ రోజుకు చేరుకున్నాయి

Update: 2024-10-07 13:26 GMT

దిశ, వరంగల్ : వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధి గాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఐదవ రోజుకు చేరుకున్నాయి. ఐదవ రోజు కార్యక్రమాలలో భాగంగా ఉదయం 4గంటలకు అర్చకులు నిత్యాహ్నికం నిర్వర్తించి అమ్మవారిని లలితా మహా త్రిపుర సుందరిగా అలంకరించడానికి అంగీకార ప్రార్ధన జరిపి సూచన వచ్చిన వెంటనే అమ్మవారిని రాజరాజేశ్వరీ (లలిత)గా అలంకరించి పూజారాధనలు జరిపారు. ఈ రోజు అమ్మవారికి స్కందమాతా క్రమం, బొధాయనమహర్షి ప్రోక్త నవరాత్ర కాల్పాన్ని అనుసరించి చందముండహా క్రమంలోనూ పూజారాధనలు జరిపారు. ఉదయం పల్లకి సేవ, సాయంకాలం శేషవాహన సేవ జరిపారు. పల్లకి సేవలో అమ్మవారిని దర్శించిన భక్తులకు సమస్త భోగాలు కలుగుతాయని, శేషవాహనంపై సేవింపబడిన అమ్మవారి యోగసిద్ధి కలుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు తెలిపారు.

నేడు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దంపతులు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని లలితా మహాయాగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే దంపతులకు, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ ఇనుగాల వెంకట్రాం రెడ్డిలకు ఆలయ కార్యనిర్వాహణాధికారి శేషు భారతి, ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషులు ఘనంగా స్వాగతం పలికి, పూజానంతరం మహదాశీర్వచనం జరిపి అమ్మవారి శేషవస్త్రాలు బహుకరించి ప్రసాదములు ఆందజేశారు. అనంతరం సాయంకాలం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరించాయి. భద్రకాళి భక్త సేవా సమితి కన్వీనర్ అయితా గోపి ఆధ్వర్యంలో వేలాది మందికి నిత్యాన్నదానం జరుగుతుంది.


Similar News