మహిళా దినోత్సవం మరుసటి రోజే కన్నీరు పెట్టిన దళిత మహిళా సర్పంచ్
మహిళా దినోత్సవం మరుసటి రోజునే ఓ దళిత మహిళా సర్పంచ్ తనను ఓ నేత... Janakipuram Sarpanch Comments
దిశ, వేలేరు/ ధర్మసాగర్ : స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఓ కీలక ప్రజాప్రతినిధి కోరికను తీర్చాలంటూ కొంతమంది ధర్మసాగర్ బీఆర్ఎస్ నేతలు ఒత్తిడి చేస్తున్నారని దళిత మహిళా సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేసింది. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని జానకీపురం గ్రామ సర్పంచ్‌గా పనిచేస్తున్న కుర్సపెల్లీ నవ్య చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. కొంతకాలంగా లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని ధర్మసాగర్ మండలం జానకీపురంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె కన్నీరు మున్నీరయింది.
గురువారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ధర్మసాగర్ మండలానికి చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు ఓ నాయకుడి కోరిక తీర్చమంటూ మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించింది. వారి మాట కాదనటంతో గ్రామాభివృద్ధికి నిధుల కేటాయింపులో వివక్ష చూపిస్తున్నారని పేర్కొంది. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు పిలవడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తాము ఆస్తులు, బంగారం, పొలాలు అమ్ముకుని రాజకీయం చేస్తున్నామని విలపించింది. నేతల కోరికలు తీర్చేందుకు రాజకీయాల్లోకి రాలేదని ప్రజలకు సేవ చేసేందుకు వచ్చామని తెలిపారు. ధర్మసాగర్, వేలేరు మండలాల్లో అగ్రవర్ణాల నాయకులదే పెత్తనమవుతోందని ఆరోపించారు. నియోజకవర్గంలో రెండు మూడు వర్గాలు ఉండటం వలన అభివృద్ధి కుంటుపడిందని విమర్శించింది. గత నెలలో మంత్రి కేటీఆర్ వేలేరులో పర్యటించినప్పుడు ఓ మహిళా ప్రజాప్రతినిధి తనను తీవ్రంగా అవమానించారని అన్నారు. ఇప్పటికైనా సదరు నేత మహిళలతో మర్యాదగా వ్యవహరించాలంటూ హెచ్చరించడం గమనార్హం.