కోర‌లు చాస్తున్న మైక్రో ఫైనాన్స్‌.. నియంత్రించ‌కుంటే ముప్పే..?!

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో మ‌ళ్లీ మైక్రో ఫైనాన్స్ దందా ప‌డ‌గ

Update: 2025-01-05 02:01 GMT

దిశ‌,వ‌రంగ‌ల్ బ్యూరో: ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో మ‌ళ్లీ మైక్రో ఫైనాన్స్ దందా ప‌డ‌గ విప్పుతోంది. రోజూవారీ వ‌డ్డీ లెక్క‌న పేద‌ల‌ను వ‌డ్డీగాళ్లు న‌డ్డి విరుస్తున్నారు. అక్క‌ర‌కు అంద‌జేస్తామంటూ చేతిలో చిన్న మొత్తాల‌ను పెడుతూ వ‌డ్డీగాళ్లు పేద‌ల‌ను జ‌ల‌గాళ్ల పీల్చేస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారులు, తోపుడు బండ్ల నిర్వాహకులు ఏరోజుకారోజు జరిగే వ్యాపారం మీద ఆధారపడి జీవిస్తుంటారు. అలాంటివారు పెట్టుబడి కోసం డెయిలీ ఫైనాన్స్ వారిని ఆశ్రయిస్తుంటారు. ఉదయం రూ.900 ఇస్తే సాయంత్రానికి రూ.వెయ్యి వసూలు చేస్తున్నారు. తద్వారా రోజుకు ఒక్కొక్కరిపై రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. మరికొందరైతే రూ.9 వేలు ఇచ్చి, పది వారాల్లో రూ.10 వేలు జమ చేసుకుంటారు. ఈ లెక్కన వడ్డీ వ్యాపారులు సాగిస్తున్న దందా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇటీవల పట్టణాల్లో మైక్రో ఫైనాన్స్ సంస్థలు వెలుస్తూ ఇళ్లు, స్థలాలు, భూములు, వాహనాలను తనఖా పెట్టుకుని అప్పు ఇస్తున్నారు. సకాలంలో చెల్లించలేకపోతే తనఖా పెట్టిన వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. అప్పు తీసుకున్న వారు సకాలంలో చెల్లింపులు చేయకపోతే బెదిరింపులకు, వేధింపులకు పాల్పడుతున్నారు. అప్పు కట్టని వారి ఇంటి వద్ద హంగామా చేయడం, వ్యాపారం చేసుకునే చోట అవమానించడం చేస్తున్నారు. డబ్బులు చెల్లించే వరకు బజారుకీడుస్తూ పరువుకు భంగం వాటిల్లేలా ప్రవర్తించడం చేస్తున్నారు. నలుగురిలో పరువు పోతుందన్న భయంతో బాధితులు లోలోపల బుజ్జగింపులకు ప్రయత్నిస్తున్నారు. వారి ఆగడాలు తాళలేక పలువురు ఇల్లు వదిలి వెళ్ళిపోతున్న సంఘటనలు సైతం ఉన్నాయి.

వారం వారం చిట్టీలు..!

నర్సంపేట పట్టణం సహా పలు గ్రామాల్లో మైక్రో ఫైనాన్స్ దందా చాపకింద నీరులా పాకుతోంది. దళారులు మొదటగా రూ. 10వేల చిట్టీ అంటూ జనాలను అలవాటు చేస్తారు. ఇందులో రూ. 9వేలు మాత్రమే చేతికిస్తారు. ప్రతీ వారం వెయ్యి కట్టాలి. ఇలా పది వారాలు అనగా రెండున్నర నెలలు కట్టాలి. ఈ పది వారాల్లో రూ.10వేలు కట్టడం పూర్తి అవుతుంది. నిర్వాహకులు మొదట వెయ్యి కట్ చేసుకుంటారు. మొత్తంగా రెండున్నర నెలలకు 1వేయి అదనంగా వస్తుంది. నార్మల్ గా పది వేలకు రెండు రూపాయల వడ్డీ అయితే 10వారాలకు 500 వడ్డీ వస్తుంది. కానీ చిట్టీల రూపంలో కడితే రూ. వేయి వస్తుంది. ఈ వడ్డీ మొదట తీసుకుంటారు. ఈ అమౌంట్ ఆరు నెలలకు, ఏడాదికి ఓసారి పెంచుతూ వెళ్తారు. ఇదిలా ఉండగా ఒక వారం కిస్తీ ఆలస్యం అయితే పది శాతం వడ్డీ అదనంగా కలిపి వచ్చే వారం కట్టాల్సిన కిస్తీ తో కలిపి కట్టాల్సి ఉంటుంది.

క‌ల‌క‌లం రేపుతున్న ఆత్మ‌హ‌త్య‌లు..

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో అక్రమ వడ్డీ వ్యాపారం దర్జాగా కొనసాగుతోంది. మైక్రో ఫైనాన్స్‌ వేధింపులతో ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లా వ్యాప్తంగా గ‌త కొద్దిరోజుల్లోనే దాదాపు ప‌ది మందికి పైగా ఈ కార‌ణం చేత ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ‌టం గ‌మ‌నార్హం. భూపాల‌ప‌ల్లి జిల్లా క‌మ‌లాపురం గ్రామంలో వారానికి రెండు వంద‌ల కిస్తీ క‌ట్ట‌లేక భార్య పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకోగా.. భార్య మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక భార్య ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న స‌మ‌యంలోనే ఇంట్లో ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఇద్ద‌రి మ‌ర‌ణంతో త‌మ సంతాన‌మైన ఇద్ద‌రు కొడుకులు అనాథ‌లుగా మిగిలారు. ఆప్ప‌న్న హ‌స్తం కోసం ఇద్ద‌రు చిన్నారులు ఎదురు చూస్తున్నారు. అత్యధికులు అనుమతి లేకుండానే ఈ దందా సాగిస్తున్నారు.

కూలీలు, చిరు వ్యాపారులే టార్గెట్‌..

కూలీలు, చిరు వ్యాపారులు, ఆటో నడుపుకునే వారే లక్ష్యంగా అధిక వడ్డీలతో అప్పులు ఇస్తూ జేబులు నింపుకుంటున్నారు. అప్పు ఇచ్చే సమయంలో ఖాళీ చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలు, బంగారు నగలు, స్థిరాస్తి డాక్యుమెంట్లను కుదవ పెట్టుకుంటున్నారు.రోజూ వారీ వడ్డీలు సాధారణంగా నెల వడ్డీకి అప్పు ఇస్తుంటారు. వ‌రంగ‌ల్ క‌రీమాబాద్‌కు చెందిన‌ ఓ యువకుడికి అత్యవసరం రావడంతో పట్టణానికి చెందిన ఓ వడ్డీ వ్యాపారి నుంచి రూ. 50 వేలు వారం రోజుల్లో ఇస్తానని అప్పుగా తీసుకున్నారు. చెప్పిన సమయానికి కాకుండా ఇరవై రోజుల అనంతరం డబ్బులు తీసుకుని వెళ్లారు. తీసుకున్నదానికి రూ.5 వేల వడ్డీ ఇవ్వాలని చెప్పడంతో యువకుడు ఆశ్చర్యపోయాడు.

గత్యంతరం లేక అడిగినంత డబ్బు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని ఘ‌ట‌న‌ల్లో పోలీసులు వ్యాపారులను పిలిపించి మందలించినా వారిలో మార్పు రావడం లేదు. ఫలితంగా ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని భూపాల‌ప‌ల్లి, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ‌, జ‌న‌గామ‌, తొర్రూరు, ములుగు, న‌ర్సంపేట వంటి ప‌ట్ట‌ణాల్లో కేంద్రాల‌ను ఏర్పాటు చేసుకుంటున్న సంస్థ‌లు మ‌ళ్లీ ప‌డ‌గ విప్పుతున్నాయి. వారం వారం కిస్తీ రూపంలో చెల్లించాలంటూ..చిన్న మొత్తాల‌ను చేతిలో పెడుతున్న వ్య‌క్తులు, సంస్థ‌లు..కిస్తి క‌ట్ట‌ని వారిపై వేధింపుల‌కు పాల్ప‌డుతున్నారు.


Similar News