ఏసీబికి చిక్కిన తొర్రూరు సీఐ జ‌గ‌దీష్‌

పీడీఎస్ అక్ర‌మ ర‌వాణాలో నిందితుడిపై కేసును మాఫి

Update: 2025-01-06 14:09 GMT

దిశ‌,వ‌రంగ‌ల్ బ్యూరో / తొర్రూరు : పీడీఎస్ అక్ర‌మ ర‌వాణాలో నిందితుడిపై కేసును మాఫి చేసేందుకు లంచం తీసుకున్న తొర్రూరు సీఐ క‌ర్రి జ‌గ‌దీష్‌ను వ‌రంగ‌ల్‌ ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప‌క్కా ఆధారాల‌తో ఏసీబీ అధికారులు ప్ర‌శ్నించ‌డంతో లంచం తీసుకున్న‌ట్లు జ‌గ‌దీస్ అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు అధికారులు సీఐ జ‌గ‌దీష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. మంగ‌ళ‌వారం వ‌రంగ‌ల్‌లోని ఏసీబీ కోర్టుకు త‌ర‌లించ‌నున్నారు. మ‌హ‌బూబాబాద్ జిల్లా తొర్రూరు పోలీస్ స్టేష‌న్‌లో సోమ‌వారం ఉద‌యం 10 గంట‌ల స‌మ‌యంలో తొర్రూరు పోలీస్ స్టేష‌న్‌కు ఏసీబీ అధికారులు చేరుకుని.. విచార‌ణ ఆరంభించారు. ఏక కాలంలో క‌ర్రి జ‌గ‌దీష్ స్వ‌స్థ‌ల‌మైన ఖ‌మ్మం జిల్లాలోని ఆయ‌న ఇంటిపై దాడులు నిర్వ‌హించ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న ఇంట్లోనూ ఏసీబీ సోదాలు నిర్వ‌హించి.. ఆదాయానికి మించిన ఆస్తులు క‌లిగి ఉన్న‌ట్లుగా, కీల‌క‌మైన ప‌త్రాల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు స‌మాచారం.


అస‌లేం జ‌రిగిందంటే..

ఏసీబీ డీఎస్పీ సాంబ‌య్య తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌త సంవ‌త్స‌రం అక్టోబ‌ర్ 2వ తేదీన సూర్య‌పేట నుంచి ఖ‌మ్మం జిల్లా కేంద్రం వైపు పీడీఎస్ రైస్‌ను తీసుకెళ్తున్న లారీని దంతాల‌ప‌ల్లి స్టేష‌న్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మొత్తం ఆరుగురిని అరెస్టు చేసి..కేసు న‌మోదు చేశారు. అయితే ఈ కేసును మాఫీ చేసేందుకు, కేసులో నిందితుల‌కు శిక్ష‌లు త‌గ్గుముఖం ప‌ట్టే విధంగా స‌హ‌క‌రించాలంటే రూ.5ల‌క్ష‌ల‌ను ఇవ్వాల‌ని అసిఫాబాద్‌కు చెందిన బియ్యం వ్యాపారి కిర‌ణ్ కుమార్‌ను సీఐ క‌ర్రె జ‌గ‌దీష్ డిమాండ్ చేశారు. 4ల‌క్ష‌లు ఇచ్చేందుకు కిర‌ణ్ కుమార్ అంగీక‌రిస్తాడు.చెప్పిన ప్ర‌కారం.. మరుస‌టి రోజైన అక్టోబ‌ర్ 3, 4వ తేదీల్లో మొత్తం రూ.2ల‌క్ష‌ల‌ను సీఐ జ‌గ‌దీష్‌కు అంద‌జేస్తాడు. అయితే ఈ కేసులో తాత్క‌లికంగా ఉప‌శ‌మ‌నం క‌ల్పించినా.. మిగ‌తా మొత్తం కోసం సీఐ వేధింపుల‌కు పాల్ప‌డ‌టంతో అదే నెల 26న వ‌రంగ‌ల్‌లోని ఏసీబీ అధికారుల‌ను ఆశ్ర‌యించాడు


సీఐ క‌ర్రి జ‌గ‌దీష్‌కు రూ.2ల‌క్ష‌లు లంచం అంద‌జేస్తున్న వీడియోలు, ఇత‌ర ఆధారాలు కిర‌ణ్ కుమార్ ఏసీబీ అధికారుల‌కు అంద‌జేశాడు. సీఐపై గ‌త మూడు నెల‌లుగా నిఘా ఉంచడంతో పాటు.. రెడ్ హ్యాడెండ్‌గా ప‌ట్టుకునేందుకు ఏసీబీ విఫ‌ల య‌త్నాలు చేసిన‌ట్లు స‌మాచారం. అయితే ఇప్ప‌టికే ఉన్న త‌మ వ‌ద్ద ఉన్న పూర్తి ఆధారాల‌తో విచార‌ణ చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలోనే సోమ‌వారం ఉద‌యం తొర్రూరు పోలీస్ స్టేష‌న్‌లో సీఐ క‌ర్రి జగ‌దీష్‌ను విచారించింది. సాక్ష్యాలు చూపడంతో నేరాన్ని అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం. ఖ‌మ్మం జిల్లాలోని సీఐ ఇంట్లోనూ ఏసీబీ సోదాలు నిర్వ‌హించిన నేప‌థ్యంలో ఈ కేసులో మ‌రిన్ని కోణాలు వెలుగు చూసే అవ‌కాశం ఉంది. దాడుల్లో ఏసీబీ సీఐలు ఎస్ రాజు, ఎల్ రాజు , మరియు ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.

సీఐ జగదీష్‌ను అదుపులోకి తీసుకున్నాం : సాంబయ్య, ఏసీబీ డీఎస్పీ వరంగల్

సీఐ జ‌గ‌దీష్ లంచం తీసుకున్న‌ట్లు వీడియో, ఆడియో ఆధారాలు లంభించాయి. విచార‌ణ‌లో నేరం చేసిన‌ట్లుగా నిర్ధార‌ణ చేసుకున్నాకే జ‌గ‌దీష్‌ను అదుపులోకి తీసుకున్నాం. విచార‌ణ కొన‌సాగుతోంది.




Similar News