ఆస్కార్ అవార్డుకు గుర్తుగా ‘చంద్రబోస్’ గ్రంథాలయం ప్రారంభోత్సవం

ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ ‘నాటు నాటు’ పాటతో

Update: 2024-07-03 09:05 GMT

దిశ,చిట్యాల: ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ ‘నాటు నాటు’ పాటతో అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ అవార్డు ను అందుకున్నాడు. తనదైన శైలిలో మాటలను పాటల రూపంలోకి మార్చి అభిమానుల మన్నన పొందాడు. ఆస్కార్ అవార్డుకు గుర్తుగా తన పుట్టిన గ్రామమైన చల్లగరిగలో తన సొంత ఖర్చులతో గ్రంథాలయ పునః నిర్మించాడు. దాదాపు రూ.36 లక్షల ఖర్చుతో నిర్మించిన గ్రంథాలయాన్ని అంగరంగ వైభవంగా, ముఖ్య ప్రముఖులతో, సినీ ప్రముఖులతో గురువారం నాడు ప్రారంభించనున్నారు.

గ్రంథాలయ నిర్మాణం..

గ్రంథాలయ భవన నిర్మాణం అత్యాధునిక హంగులతో భవనాన్ని నిర్మించారు. సుమారు రూ. 36 లక్షల అంచనాలతో రెండు అంతస్తుల భవనం నిర్మించారు. చంద్రబోస్ చదువుకునే రోజుల్లో తన ఇంటి పక్కన శివాలయం గ్రంథాలయం ఉండేది. స్థానిక శివాలయం లో జరిగే భక్తి పాటలు సాయంత్రం భజన పాటలు వింటూ గ్రంథాలయంలో అప్పుడున్న బాల సాహిత్యం పై మక్కువ పెంచుకొని ఇతర సాహిత్య పుస్తకాలను ఇష్టంగా చదవడం వల్లనే తనకు పాటలు రాయడం అలవాటుగా మారిందని, ఆ పాటలతోనే సినీ పరిశ్రమలో అవకాశం లభించిందని ఎప్పుడూ చెప్తుండేవారు. తనకు ఇంతటి ఘన కీర్తిని సంపాదించి పెట్టిన ఊరికి నా పాటలకు పునాది వేసిన గ్రంథాలయానికి, నాలాగే ఇంకా ఎంతో మందికి ఉపయోగకరంగా ఉండాలనే సంకల్పంతో ఆస్కార్ అవార్డు గుర్తుగా గ్రంథాలయాన్ని పునః నిర్మించానన్నారు.

ప్రముఖులకు ఆహ్వానం

చిట్యాల మండలంలోని చల్లగరిగ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆస్కార్ గ్రంథాలయాన్ని ప్రారంభోత్సవానికి పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి తూర్పాటి శ్రీలత తెలిపారు. గురువారం నిర్వహించే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి భవన నిర్మాణ దాత చంద్రబోస్ తో పాటు పలువురు కళాకారులు అభిమానులు రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నట్టు ఆమె తెలిపారు.


Similar News