Transfers : భారీగా ఎస్‌జీడీసీలు, డీసీల బ‌దిలీలు

స్పెష‌ల్ గ్రేడ్ డిప్యూటీ క‌లెక్ట‌ర్లు, డిప్యూటీ క‌లెక్ట‌ర్ల‌ను బ‌దిలీ చేస్తూ సోమ‌వారం రెవెన్యూ శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ న‌వీన్ మిట్ట‌ల్ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

Update: 2024-10-28 13:58 GMT

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : స్పెష‌ల్ గ్రేడ్ డిప్యూటీ క‌లెక్ట‌ర్లు, డిప్యూటీ క‌లెక్ట‌ర్ల‌ను బ‌దిలీ చేస్తూ సోమ‌వారం రెవెన్యూ శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ న‌వీన్ మిట్ట‌ల్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 70 మంది అధికారుల‌ను బ‌దిలీ చేయ‌గా ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో 17 మంది అధికారుల‌కు స్థాన చ‌ల‌నం క‌లిగింది. స్పెష‌ల్ గ్రేడ్‌ డిప్యూటీ క‌లెక్ట‌ర్ హోదాలో ఉన్న ములుగు జిల్లా అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ మ‌హేంద‌ర్ జీని మ‌హ‌బూబాబాద్ జిల్లా రెవెన్యూ అద‌న‌పు క‌లెక్ట‌ర్‌గా బ‌దిలీ చేశారు. అలాగే జీడ‌బ్ల్యూఎంసీ సెక్ర‌ట‌రీగా ప‌నిచేస్తున్న విజ‌య ల‌క్ష్మిని వ‌రంగ‌ల్ డీఆర్వోగా బ‌దిలీ చేశారు. షాద్‌న‌గ‌ర్ ఆర్డీవోగా ప‌నిచేస్తున్న వెంక‌ట మాధ‌వ‌రావును మ‌హ‌బూబాబాద్‌కు డీఆర్వోగా వ‌చ్చారు.

వ‌రంగ‌ల్ డీఆర్వోగా ప‌నిచేస్తున్న కె.శ్రీనివాస్‌ను రంగారెడ్డి జిల్లా స్పెష‌ల్ డిప్యూటీ క‌లెక్ట‌ర్‌గా, యూఎల్‌సీగా బ‌దిలీపై వెళ్లారు. వెకెన్సీ రిజ‌ర్వులో ఉన్న డిప్యూటీ క‌లెక్ట‌ర్ రాథోడ్ ర‌మేష్‌ను హ‌న్మ‌కొండ ఆర్డీవోగా బ‌దిలీపై వ‌చ్చారు. హ‌న్మ‌కొండ ఆర్డీవోగా ప‌నిచేస్తున్న డిప్యూటీ క‌లెక్ట‌ర్‌ వెంక‌టేష్‌కు ములుగు ఆర్డీవోగా పోస్టింగ్ క‌ల్పించారు. స్టేట్‌ సివిల్ స‌ప్లైలో ప‌నిచేస్తున్న ఉమారాణిని న‌ర్సంపేట ఆర్డీవోగా, ములుగు ఆర్డీవోగా ప‌నిచేస్తున్న స‌త్య‌పాల్ రెడ్డిని వ‌రంగ‌ల్ ఆర్డీవోగా నియ‌మించారు. రంగారెడ్డి జిల్లా స్పెష‌ల్ డిప్యూటీ కలెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న గోపిరామ్‌ను జ‌న‌గామ ఆర్డీవోగా బ‌దిలీ చేశారు. ఖ‌మ్మంలో ఆర్డీవోగా ప‌నిచేస్తున్న గుంటుప‌ల్లి గ‌ణేష్ తొర్రూరు ఆర్డీవోగా నియ‌మ‌తుల‌య్యారు.

జ‌హీరాబాద్ ఆర్డీవోగా ప‌నిచేస్తున్న ఎస్‌.రాజును మ‌హ‌బూబాబాద్ ఆర్డీవోగా నియ‌మితుల‌య్యారు. న‌ల్గొండ ఆర్డీవోగా ప‌నిచేస్తున్న ఎన్‌.ర‌విని వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ జిల్లాల భూసేక‌ర‌ణ ప్ర‌త్యేకాధికారిగా నియ‌మించారు. జ‌న‌గామ ఆర్డీవోగా ప‌నిచేస్తున్న కొముర‌య్య‌కు హ‌న్మకొండ జిల్లాలో ఆర్డీవో ర్యాంక్ అధికారిగా పోస్టింగ్ క‌ల్పించి.. సివిల్ స‌ప్లై స్టేట్ విభాగంలో డిప్యూటేష‌న్ కింద విధులు కేటాయించారు. అలాగే వ‌న‌ప‌ర్తి స్పెష‌ల్ డిప్యూటీ క‌లెక్ట‌ర్‌, భూ సేక‌ర‌ణ ప్ర‌త్యేకాధికారిగా ప‌నిచేస్తున్న సిహెచ్ వెంక‌టేశ్వ‌ర్లుకు అదే హోదాలో భూపాల‌ప‌ల్లి జిల్లాకు బ‌దిలీ చేశారు. మొత్తం 17 మంది అధికారుల‌కు స్థానచ‌ల‌నం క‌లిగింది.



Similar News