'ఎక్సైజ్‌'కు మేడారం జాత‌ర కిక్కు.. భారీగా అమ్మకాలు

Update: 2022-02-05 15:14 GMT

దిశ‌ ప్రతినిధి, వ‌రంగ‌ల్: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. జాతర సందర్భంగా ఎక్సైజ్‌ శాఖ అధికారులు 22 షాపుల ఏర్పాటుకు ఈనెల 13 నుంచి 19వ తేదీ వరకు అనుమతి ఇచ్చారు. ఈ షాపులన్నీ కూడా ఆదివాసీల‌కే కేటాయింపు చేశారు. ఈనెల 10 వ‌ర‌కు ఆస‌క్తి గ‌ల వారి నుంచి ఐటీడీఏ అధికారులు ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించి ఎంపిక చేయ‌నున్నారు. ఒక్కో మద్యం షాపు రోజుకు రూ.9 వేల అద్దె చొప్పున ఏడు రోజులకు గాను రూ.63వేల ఆదాయం ఎక్సైజ్ శాఖ‌కు స‌మ‌కూర‌నుంది. మొత్తం 22 షాపుల ద్వారా రూ.13 లక్షల 86 వేలు ఎక్సైజ్ ఖాతాకు చేరనున్నది. గ‌త జాత‌ర‌లో కూడా 22 మ‌ద్యం దుకాణాల‌కు అనుమ‌తులు ఇచ్చారు. అమ్మకాల ద్వారా దాదాపు రూ.7 కోట్ల వ‌ర‌కు ఆదాయం స‌మ‌కూరింద‌ని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈసారి ధ‌ర‌లు అధికంగా ఉండ‌టంతో పాటు భ‌క్తుల సంఖ్య కూడా ఎక్కువ‌గా వస్తుండడంతో సుమారు రూ.10 కోట్ల పైగా క‌లెక్షన్ రావొచ్చని ఎక్సైజ్ అధికార వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా జాత‌ర‌లో ఆదివాసీల‌కే వైన్‌షాపులు ఏర్పాటు చేసేందుకు ఐటీడీఏ అధికారులు చ‌ర్యలు తీసుకుంటున్నా.. ఆర్థిక శ‌క్తి లేక‌పోవ‌డంతో గిరిజ‌నేత‌రుల చేతుల్లోకి వెళ్లిపోనున్నాయి. షాపులు ద‌క్కించుకున్న ఆదివాసీల‌కు ఎంతోకొంత ముట్టజెప్పనున్న ఆదివాసీయేత‌రులు పెద్ద మొత్తంలో లాభాలు దండుకోనున్నారు.

Tags:    

Similar News