మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిచ్చిన భద్రకాళీ అమ్మవారు..
వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధి గాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానంలో శ్రీ భద్రకాళి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి.
దిశ, వరంగల్: వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధి గాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానంలో శ్రీ భద్రకాళి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. తొమ్మిదో రోజు కార్యక్రమాలలో భాగంగా ఉదయం 4గంటలకు అర్చకులు నిత్యాహ్నికం నిర్వర్తించిన పిమ్మట అర్చకులు అమ్మవారిని మహిషాసుర మర్ధినిగా అలంకరించి పూజారాధనలు జరిపారు. వరాహ పురాణాన్ని అనుసరించి సిద్ధిధాత్రి దుర్గ క్రమంలో బోధాయనోక్త నవరాత్రి కల్పాన్ననుసరించి శుంభహా దుర్గా క్రమంలోను అమ్మవారికి పూజారాధనలు జరిపారు. ఉదయం అమ్మవారికి చతురన్త సేవ, సాయంకాలం సర్వభూపాల వాహన సేవలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. అమ్మవారిని మేనా ఎక్కించి అట్టి మేనాను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మోస్తూ అమ్మవారిని సేవిస్తుంటారు.
తద్వారా ఇట్టి సేవను దర్శించడం వల్ల సత్సంతానం, అధికారం, విద్యా, తెలివితేటలు సమకూరుతాయి. సర్వభూపాల వాహన సేవలో అమ్మవారిని వేంచేపు చేసి అష్టదిక్పాలకులు మోస్తూ అమ్మవారిని సేవిస్తారు. ఈ సేవను దర్శించడం వల్ల సర్వతోముఖ విజయ ప్రాప్తి కలుగుతుందని భద్రకాళి దేవస్థానం ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు తెలిపారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు నవరాత్రి మహోత్సవాల పూర్ణాహుతి నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమంలో భక్తులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం సాయంకాలం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతో అలరించాయి. రేపు అమ్మవారికి ఉదయం సామ్రాజ్య పట్టాభిషేకం, చక్రస్నానం అనంతరం ధ్వజారోహణం తదుపరి తెప్పోత్సవం నిర్వహించబడతాయని, తెప్పోత్సవాన్ని జరుపుకొని తిరిగి వస్తున్న అమ్మవారిని దర్శించడం వల్ల ముక్తి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయని ఆలయ సిబ్బంది తెలిపారు.