నాలుగవ రోజుకు చేరుకున్న దేవి శరన్నవరాత్రులు...
కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో పరమ పావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళీ దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి లు నాలుగవ రోజుకు చేరుకున్నాయి
దిశ, వరంగల్ : కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో పరమ పావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళీ దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి లు నాలుగవ రోజుకు చేరుకున్నాయి. ఉదయం 4గంటలకు నిత్యాహ్నికం నిర్వర్తించిన పిమ్మట అర్చకులు అమ్మవారిని మహాలక్ష్మిగా అలంకరించి పూజారాధనలు జరిపారు. నవదుర్గా కల్పోక్త నవరాత్రి పూజా విధానాన్ని అనుసరించి అమ్మవారిని కూష్మాండి, గిరిజా క్రమాలలో పూజారాధనలు జరిపారు.
కూష్మాండి క్రమంలో అర్చించడం వల్ల సాధకుడు నుండి అసూరి శక్తులు దూరమవుతాయి. గిరిజా క్రమంలో ఆరాధింపబడిన అమ్మవారు సాధకులకు సకల సౌభాగ్యాలు ప్రాప్తిస్తాయని భద్రకాళి ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు తెలిపారు. అమ్మవారిని ఉదయం సూర్యప్రభ వాహనం మీద సాయంకాలం హంస వాహనం మీద ఊరేగింపు జరిపారు. నేడు ఆదివారం కావడంతో దేవాలయానికి భక్తులు పోటెత్తారు. సాయంకాలం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా హరికథ, భక్తి సంగీతం, కర్ణాటక సంగీతం, కూచిపూడి నృత్యాలు భక్తులను ఎంతగానో అలరించాయి.