దిశ ఎఫెక్ట్... దిశ కథనానికి స్పందించిన కలెక్టర్..
నర్సంపేట పట్టణంలోని సర్వాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల స్థలం కబ్జాకు గురవుతోందని ఆరోపిస్తూ ఫెన్సింగ్ పనులను స్థానిక యువత అడ్డుకున్న సంగతి తెలిసిందే.
దిశ, నర్సంపేట : నర్సంపేట పట్టణంలోని సర్వాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల స్థలం కబ్జాకు గురవుతోందని ఆరోపిస్తూ ఫెన్సింగ్ పనులను స్థానిక యువత అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 'ప్రభుత్వ పాఠశాల స్థలం కబ్జా..?' అనే కథనాన్ని దిశ సవివరంగా ప్రచురించింది. ఈ కథనానికి వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద స్పందించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందజేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని, నర్సంపేట ఎమ్మార్వో, మున్సిపాలిటీ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం సర్వాపురం ప్రభుత్వ పాఠశాలకు చేరుకున్న ఎం.ఈ.ఓ సారయ్య పాఠశాల స్థలాన్ని సర్వే చేయించారు.
స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు ఏర్పాటు చేయడం కోసం స్థానికుల్లో కొందరు అనుకూలంగా వినతిపత్రం అందజేయగా మరికొందరు వ్యతిరేకంగా అందజేసినట్లు సమాచారం. ఇరు పక్షాల నుంచి వినతిపత్రాలు తీసుకున్నారు. ఈ రిపోర్టును జిల్లా విద్యాశాఖ అధికారి(డీ.ఈ.ఓ)కి పంపనున్నట్లు తెలిపారు. అనంతరం రెవెన్యూ శాఖ నుండి ఎమ్మార్వో, ఆర్.ఐ, మున్సిపాలిటీ నుండి టౌన్ ప్లానింగ్ అధికారులు పాఠశాలకు చేరుకుని వివరాలు సేకరించారు. మూడు శాఖలు వేరువేరుగా పాఠశాల భూమిని సర్వే చేయించి, స్థానికుల నుండి వివరాలు సేకరించి రిపోర్ట్ తయారు చేసినట్లు తెలుస్తోంది. మూడు శాఖల నుండి పంపించే నివేదిక ఆధారంగానే కలెక్టర్ నిర్ణయం తీసుకోనున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మూడు శాఖలు తయారు చేసిన రిపోర్టుల్లో ఏముందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.