ఉట్లపల్లిలో బీజేపీ ప్రజా చైతన్య యాత్ర ప్రారంభం
భూపాలపల్లి జయశంకర్ జిల్లా కాటారం మండలంలోని ఉట్లపల్లి పోచమ్మ ఆలయం నుంచి బీజేపీ ప్రజా చైతన్య యాత్ర ప్రారంభమైంది.
దిశ, మహాదేవపూర్ : భూపాలపల్లి జయశంకర్ జిల్లా కాటారం మండలంలోని ఉట్లపల్లి పోచమ్మ ఆలయం నుంచి బీజేపీ ప్రజా చైతన్య యాత్ర ప్రారంభమైంది. బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి చేపట్టిన మంథని ప్రజా చైతన్య యాత్రను ఆదివారం మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గడ్డం వివేక్ వెంకట స్వామి ప్రారంభించారు. యాత్ర కు వచ్చిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు , అభిమానులతో కలిసి మహాదేవపూర్ మండలంలోని అన్నారం గ్రామంలోని పురవీధులలో పాదయాత్ర చేసి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ సునీల్ రెడ్డి ఇంత గొప్ప యాత్ర చేపట్టడాన్ని అభినందిస్తున్నామన్నారు.
కాళేరం, అన్నారం ప్రాజెక్టుల వల్ల అన్నారం గ్రామస్తులు ప్రతి సంవత్సరం పంటలు పూర్తిగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై వేలకోట్ల అవినీతి చేసిందని అన్నారు. మెగా కృష్ణారెడ్డి వంటి వాళ్లకు ప్రాజెక్టులను అప్పగించి ఈరోజు ప్రపంచంలోనే ధనికుడ్ని చేసిందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు కమీషన్ల ప్రాజెక్టని, ప్రతి సంవత్సరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల పంటలు నష్టపోతున్న రైతులకు ఏ విధమైన సహాయ సహకారాలు అందించకపోవడం బాధాకరం అని ఆరోపించారు. ప్రజల్లో చైతన్యం నింపడానికి ఇటువంటి యాత్రలు ఎంతగానో అవసరమన్నారు. ఈ మంథని నియోజక వర్గ ప్రాంతాన్ని అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ కాలేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల ఈ ప్రాంతం పూర్తిగా ముంపునకు గురై పంటలు వేసుకోలేని స్థితిలో రైతాంగం చాలా ఇబ్బందులకు గురవుతుందని అన్నారు. అలాగే ఈ ప్రాంతానికి ప్రత్యేక నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేశారని విమర్శించారు.
బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ మాట్లాడుతూ ఈ ప్రజా చైతన్య యాత్ర అన్నారం గ్రామంలో చేయడానికి కారణం కాళేశ్వరం, అన్నారం ప్రాజెక్టుల వల్ల ఎక్కువగా నష్టపోయేది ఈ గ్రామస్తులే, ఇక్కడ నుండే ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ యాత్రను ప్రారంభించడం జరిగిందని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి కుటుంబ పాలనను ఈ రాష్ట్రం నుంచి తరిమేయడానికి బీజేపీ కంకణం కట్టుకుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని, అప్పుల కుప్పగా మార్చివేసిందని ఆరోపించారు. కేంద్ర పథకాల వల్లే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. గ్రామాలలో శ్మశానవాటికలు, రైతు వేదికలు, డంపింగ్ యార్డులు, ఇలాంటి ఎన్నో అభివృద్ధి పథకాలను కేంద్రం ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే దొంగలాగా రాత్రికి రాత్రే మళ్లించిన ప్రభుత్వం కేసీఆర్ దని మండిపడ్డారు. కేసీఆర్ గొప్పగా కాళేశ్వరం ప్రాజెక్ట్ గురుంచి చెప్పి ఈ ప్రాంత ప్రజలను పూర్తిగా మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నారం లో కరెంటు వ్యవస్థ సరిగా లేదని, డబుల్ బెడ్ రూమ్ లు లేవని, రైతు రుణమాఫీ లేదని, ఇలా అనేక సమస్యలు ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్నారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నారం ప్రాంతంలో ఒక ప్రాథమిక వైద్యశాల, కరెంటు సబ్స్టేషన్ అలాగే కాళేశ్వరం నుంచి అన్నారం వరకు బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మంథని మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాం రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కన్నం యుగదీశ్వర్ , యాత్ర ప్రముఖ్ వెన్నంపల్లి పాపయ్య,పెద్దపల్లి జిల్లా ఇంచార్జి రావుల రామ్ నాథ్, జిల్లా మంథని నియోజకవర్గ ఇన్చార్జి ప్రభారీ అనిల్ రెడ్డి , మహాదేవ్ పూర్ మండల అధ్యక్షులు సిరిపురం శ్రీమన్నారాయణ, యాత్ర సహా ప్రముఖ్ లు దుర్గం తిరుపతి, వివిధ మండలాల అధ్యక్షులు,మల్కామోహన్ రావు, పిలుమారి సంపత్, బొమ్మన భాస్కర్ రెడ్డి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పాగే రంజిత్ కుమార్, చింతకాని ఎంపీటీసీ ఉడుముల విజయరెడ్డి, మండల అధ్యక్షులు జంగంపల్లి అజయ్, మండల ప్రధాన కార్యదర్శులు బొల్లం కిషన్, సూరం మహేష్, మంథని రాజేందర్, పూసల రాజేంద్రప్రసాద్, గంట అంకయ్య, పసుల శివ, మేడిపల్లి పూర్ణ చందర్, శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు సత్య ప్రకాష్, ఆకుల శ్రీధర్,జిల్లా నాయకులు పోతారవేణి క్రాంతి, బోగోజ్ శ్రీనివాస్, మాచగిరి రాము, నాంపల్లి రమేష్, వీరబోయిన రాజేందర్,చిలువేరు సతీష్, రవి యాదవ్, సంతోష్, బీమవరపు సంపత్, బీజేవైఎం జిల్లా ఉప అధ్యక్షులు కరెంగుల రామకృష్ణ, బీజేవైఎం మండల అధ్యక్షులు రామ్ శెట్టి మనోజ్, ముద్ర కోళ్ల సుధాకర్, అజ్మీరా నవీన్, గొర్రె శ్రీకాంత్, లంగారి ఉపేందర్, నూకల మహేందర్, జయకర్, లింగంపల్లి జోగేష్, సోనారి శ్యామ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.