సమస్యలు తీరవు.. వినతులు మారవు!
సమస్యలు తీరవు.. వినతులు మారవు అన్నట్లుగా వరంగల్ మహానగర పాలక సంస్థల పాలన పరిస్థితులు ఉన్నాయి.
దిశ, వరంగల్ టౌన్ : సమస్యలు తీరవు.. వినతులు మారవు అన్నట్లుగా వరంగల్ మహానగర పాలక సంస్థల పాలన పరిస్థితులు ఉన్నాయి. వస్తానా.. పోతానా ఓ రామచిలుక మాదిరిగా వారం వారం గ్రీవెన్స్‌సెల్‌కు ప్రజలు రావడం తప్ప సమస్యలు పరిష్కారమైనట్లు పరిస్థితులు కనిపించడం లేదు. ఒక్కొక్కరు ఒక్కో సమస్యపై ఐదారు సార్లు వినతులు సమర్పించడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ప్రధానంగా భూకబ్జాలు, ఆక్రమిత భూముల్లో నిర్మాణాలు చేపట్టడంపై బల్దియా అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటి నిర్మాణాలకు తామే అనుమతి ఇచ్చామనే ఉద్దేశంతో ఆక్రమిత భూముల్లో నిర్మాణాలపై దృష్టిసారించడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
అలా చేస్తే తాము ఎక్కడ దోషులుగా నిలబడాల్సి వస్తుందోనని, అక్రమ నిర్మాణాలపై చర్యలకు బల్దియా వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా, సోమవారం నాటి గ్రీవెన్స్‌సెల్‌లో కూడా పలువురు ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో కబ్జాలు, వాటిల్లో చేపడుతున్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరడం బల్దియా పనితీరుకు నిలువుటద్దంగా నిలుస్తోంది. ఇక ప్రతీ వారం గ్రీవెన్స్‌లో వీధిదీపాలు, పైపులైన్ లీకేజీలు, నీటి సరఫరాపై వినతులు రావడం పరిపాటిగా మారింది. దీంతో అధికారులు కూడా అలాంటి సమస్యలను సాధారణమైనవిగా భావించి, పెద్దగా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. మొత్తంగా బల్దియా పనితీరుకు గ్రీవెన్స్‌సెల్ కొలమానంగా నిలుస్తోంది.
ప్రజా విజ్ఞప్తులను తక్షణమే పరిష్కరించండి : కమిషనర్
వేగవంతంగా ప్రజా విజ్ఞప్తులకు పరిష్కారం చూపాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. సోమవారం గ్రీవెన్స్‌లో వినతులు స్వీకరించిన ఆమె అధికారులకు పలు సూచనలు చేశారు. కాగా, బల్దియాకు మొత్తం 78 వినతులు వచ్చాయి. వీటిలో ఇంజినీరింగ్ విభాగానికి 15, ప్రజారోగ్య విభాగం 5, ప్రాపర్టీ టాక్స్ 6, టౌన్ ప్లానింగ్ 51, మంచినీటి సరఫరా విభాగానికి ఒక దరఖాస్తు వచ్చింది. కార్యక్రమంలో ఎస్‌ఈ ప్రవీణ్ చంద్ర, సిఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, హెచ్‌ఓ రమేష్, బయాలజిస్ట్ మాధవ రెడ్డి, డిఎఫ్‌ఓ శంకర్ లింగం, ఇన్చార్జి సిపి రవీందర్ రాడేకర్, ఎంహెచ్‌వో డాక్టర్ రాజేష్, పన్నుల అధికారి బిర్రు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.