గుట్టలుగా గుట్కా..విచ్చలవిడిగా విక్రయాలు
గుట్కా గుట్టలుగుట్టలుగా పట్టుబడుతోంది.
దిశ, హన్మకొండ : గుట్కా గుట్టలుగుట్టలుగా పట్టుబడుతోంది. వరంగల్ కమిషనరేట్ పరిధిలో టాస్క్‌ఫోర్స్ టీం చేపడుతున్న దాడుల్లో నిత్యం పెద్ద ఎత్తున గుట్కా దొరుకుతుంది. గతంలో గుట్కా రవాణాలో ఆరితేరిన నేర శూరులు మళ్లీ తమ ప్రావీణ్యానికి పదును పెట్టారు. పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద మొత్తంలో వరంగల్ పట్టణానికి తరలిస్తున్నారు. నగర శివారుల్లో ఏకంగా గోదాంలను ఏర్పాటు చేసుకుని రాత్రివేళల్లో గమ్యాలకు చేరుస్తున్నారు. అక్కడి నుంచి చిల్లర వ్యాపారుల ద్వారా దుకాణాలకు చేరుస్తున్నారు. గుట్కాపై దాడులు చేసి పట్టుకుంటున్నా విక్రయదారులపై మాత్రం ఎలాంటి చర్యలు ఉండటం లేదు. దీంతో యథేచ్ఛగా అమ్మకాలు జరుగుతున్నాయి. దీంతో గుట్కా నిషేధం అసలు ఉన్నట్టా..? లేనట్టా..? అన్న సందేహం కలగక మానడం లేదు.
పక్కా నెట్వర్క్‌తో దందా..!
మహారాష్ట్ర నుంచి రైళ్లు, ఇతర వాహనాల్లో గుట్కా తో పాటు దేశీదారును జిల్లాకు తీసుకొస్తున్నారు. కొంతమంది వ్యాపారులు కేవలం ఈ దందానే తమ వృత్తిగా చేసుకుని జిల్లా వ్యాప్తంగా చిరువ్యాపారులు, కిరాణా దుకాణాలకు చేరవేస్తున్నారు. మండలాల వారీగా దళారులను ఏర్పాటు చేసుకొని ఈ వ్యాపారం సాగిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా తినుబండారాలు అమ్ముతున్నట్లుగానే మోటారు సైకిళ్లు, చిన్నచిన్న గూడ్స్ వాహనాల్లో అంబర్, అనార్, ఖైనీ వంటి మత్తు పదార్థాలను పల్లెలకు చేరవేస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లోని చిన్నచిన్న దుకాణాల్లో సైతం గుట్కా విచ్చలవిడిగా లభిస్తుందంటే దందా ఏ మేరకు సాగుతుందో అర్థమవుతున్నది.
రకరకాల పేర్లు, అధిక రేట్లు...
నిండు జీవితాలు పొగాకు ఉత్పత్తులకు బలవుతున్నాయి. పొగాకు ఉత్పత్తులను రకరకాల పేర్లతో ఎమ్మార్పీ లేకుండా అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. వీటిలో విమల్, మాణిక్ చంద్ (ఎంసీ), సితార్, సాగర్, గోవా, ఎంజీఎం, హాన్స్, చైనీఖైనీ, మీరాజ్, రెబల్, సిమ్లా, పాన్ బార్, విమల్, ఖలేజా, ఆర్డీఎం, కె 7000, కె 9000, 24 క్యారెట్ వంటి వాటికి ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా భారీ గిరాకీ ఉంది. వీటిని విక్రయించే స్థలం, సమయం, పరిస్థితిని బట్టి రూ.20 నుంచి రూ.40 వరకు వసూలు చేస్తున్నారు. అధిక ధర అయినా, దొరకడమే భాగ్యం అన్నట్టుగా వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. విచ్చలవిడిగా గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తుండడంతో యువత వాటికి బానిసలవుతున్నారు. పొగాకు ఉత్పత్తులు 53.5 శాతం మంది, నికోటిన్ ఉత్పత్తులు వినియోగిస్తున్నట్లు, గుట్కా, పాన్ మసాలాను నమిలేవారు 48.07 శాతం మంది ఉన్నారని ఓ సర్వేలో తేలింది.
వీరిలో ఎక్కువగా పిల్లలు..
పొగాకు, గుట్కా వినియోగించే వారిలో 17 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సున్న యువకులే అధికంగా ఉన్నారు. క్యాన్సర్, గుండె , కాలేయం, కిడ్నీ సంబంధిత వ్యాధులకు గురవుతూ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా యువకులు గుట్కా, స్మోకింగ్, గంజాయి లాంటి వ్యసనాలకు అలవాటు పడి ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. జల్సా , ఎంజాయ్‌మెంట్‌తో ప్రారంభమై వ్యసనంగా మారుతోంది. గల్లీకో డబ్బా పెడుతూ విచ్చలవిడిగా గుట్కా, తంబాకు, సిగరెట్లు ఇలా పలు రకాలైన గుట్కా పదార్థాలను అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రాణానికి హాని కలిగించే పొగాకు ఉత్పత్తులను నియంత్రించాల్సిన అవసరం ఉంది.