వీఆర్ఓల అరణ్యరోదన.. ఏడాదిన్నరగా నో సాలరీ!

రెవెన్యూ శాఖను బలోపేతం చేస్తామని గత సర్కారు వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసింది. రీడెప్లాయిమెంట్ పేరుతో 5138 మందిని ఇతర శాఖలు, వివిధ కార్పొరేషన్లలో జూనియర్ అసిస్టెంట్లుగా సర్దుబాటు చేసింది.

Update: 2024-01-05 03:57 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రెవెన్యూ శాఖను బలోపేతం చేస్తామని గత సర్కారు వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసింది. రీడెప్లాయిమెంట్ పేరుతో 5138 మందిని ఇతర శాఖలు, వివిధ కార్పొరేషన్లలో జూనియర్ అసిస్టెంట్లుగా సర్దుబాటు చేసింది. ఆగమేఘాల మీద లాటరీ ద్వారా శాఖలు కేటాయిస్తూ రాత్రికిరాత్రి బలవంతంగా బదిలీ చేసింది. కానీ వీఆర్ఓగా వారి పాత సర్వీసు కాలాన్ని ఏ విధంగా లెక్కించాలనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు. కనీసం మార్గదర్శకాలతో జీఓలు రూపొందించలేదు. దీంతో టీఎస్ పీఎస్సీ ద్వారా నియామకమైనా.. పలువురికి పే స్కేల్ కూడా లేకుండాపోయింది. కార్పొరేషన్ ఖర్చుల కింద వేతనాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పలు కార్పొరేషన్లలో పని చేస్తున్న పలువురు పూర్వ వీఆర్ఓలకు 17 నెలలుగా వేతనాలు అందడం లేదు.

సీఎం, మంత్రులకు మొర

‘1998 నుంచి రెవెన్యూ శాఖలో పని చేస్తున్నాం. ‘తెలంగాణ వీఆర్ఓ వ్యవస్థ రద్దు చట్టం- 2020’ ద్వారా వేర్వేరు ప్రభుత్వ శాఖల్లో నియమించాల్సి ఉన్నది. కానీ ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రమే లాటరీ విధానంలో 16 మందిని ప్రభుత్వానికి వెలుపల గిరిజన సహకార సంస్థ (జీసీసీ), భద్రాచలం డివిజన్ కు రీడెప్లాయిమెంట్ చేసింది. 2022 ఆగస్టు 2 నుంచి అక్కడే విధులు నిర్వర్తిస్తున్నాం. దీంతో ప్రభుత్వ సదుపాయాలన్నీ కోల్పోయాం. ఇంకా 17 నెలలుగా కార్పొరేషన్ వేతనాలు చెల్లించడం లేదు.’ అని 16 మంది పూర్వ వీఆర్ఓలు సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లకు రాసిన లేఖలో మొరపెట్టుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పూర్వ వీఆర్ఓల స్థితిగతులపై మంగళవారం ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీసినట్లు తెలిసింది.

సౌకర్యాలు కోల్పోయామని ఆవేదన

టీఎస్ పీఎస్సీ పరీక్షలు రాసి ఉద్యోగాలు సాధించినా.. గత సర్కారు అసంబద్ధ చర్యల వల్ల అన్ని సౌకర్యాలు కోల్పోయామని పూర్వ వీఆర్ఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 010 పద్దు కింద ట్రెజరీ ద్వారా వేతనాలు పొందలేకపోతున్నామని, జీపీఎఫ్, సీపీఎస్, టీఎస్జీఎల్ఐ చందా చెల్లింపునకు అవకాశం లేకుండాపోయిందని చెబుతున్నారు. దీంతో ఉద్యోగ విరమణ అనంతరం తమ సామాజిక భద్రత ప్రమాదంలో పడినేట్లేనని పేర్కొంటున్నారు. వారసులకు కారుణ్య నియామకాలు, ఆరోగ్యం, పిల్లల చదువుల విషయమై రాయితీ పొందే సౌకర్యం, ప్రభుత్వ పింఛను పొందే అర్హతనూ కోల్పోయామని వాపోతున్నారు. ‘జీసీసీలో పని చేస్తున్న 16 మందికి 17 నెలలుగా వేతనాలు లేవని, దీంతో తాము ప్రభుత్వ ఉద్యోగులమా? కాంట్రాక్టు ఉద్యోగులమా? అనేది తెలియడం లేదని సీఎం, మంత్రికి రాసిన లేఖలో పూర్వ వీఆర్ఓలు మొరపెట్టుకున్నారు. కొందరు ఉద్యోగ విరమణకు దగ్గరలో ఉన్నారని, దీంతో ప్రభుత్వ ప్రయోజనాలు కోల్పోయే ప్రమాదముందని వాపోయారు. తమను ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయాలని కోరారు.

ఇతర శాఖలకు మార్చాలని..

జీసీసీకి బదిలీ అయిన 16 మంది పూర్వ వీఆర్ఓలకు 17 నెలలుగా వేతనాలు లేవు. ఇందులో ఒకరు ఆరు సార్లు ఉత్తమ ఉద్యోగిగా అవార్డు సైతం అందుకున్నారు. ఒకరు మానసిక వేదనను భరించలేక అనారోగ్యానికి గురై చనిపోయారు. మరో ఇద్దరికి అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ఒకరేమో రేషన్ షాప్ కి ఇన్ చార్జిగా ఉన్నారు. గిరిజన సహకార కార్పొరేషన్ ఉత్పత్తులు అమ్మితేనే 60:40 లెక్కన వేతనాలు ఇస్తామంటున్నారు. ఇలా పలు కార్పొరేషన్లకు వెళ్లిన ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ చర్యల వల్ల సుమారు 1500 మంది పూర్వ వీఆర్ఓలు కార్పొరేషన్లు, సొసైటీలు, అటానమస్ బాడీలో పడ్డారు. కనీసం 25% మంది తీవ్ర ఉద్యోగ సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరంతా కనీసం ఇతర శాఖలోకి మార్చినా చాలంటున్నారు. మరోవైపు తిరిగి రెవెన్యూలోకి రావడానికి కొందరు సిద్ధంగా లేనట్లు తెలుస్తున్నది.

న్యాయం జరుగుతుందని ఆశతో ఎదురుచూస్తున్నాం: వెంకటమ్మ, జీసీసీ ఉద్యోగి (పూర్వ వీఆర్ఓ)

నేను ఆదివాసీ బిడ్డను. వీఆర్ఓగా పని చేస్తూ ఆరు సార్లు ఉత్తమ ఉద్యోగినిగా అవార్డులు పొందాను. నాకు జాబ్ వచ్చినా లాభం లేకుండాపోయింది. జీసీసీకి బదిలీ చేశారు. వాళ్లు 17 నెలలుగా వేతనం ఇవ్వడం లేదు. ఇప్పటికే నా బంగారం అమ్మేశాను. ప్రతి నెలా నేను రూ.15 వేల వంతున ఈఎంఐ కట్టాలి. ప్రస్తుతం మా నాన్న పెన్షన్ డబ్బులతోనే బతుకుతున్నాను. నాకు ముగ్గురు అమ్మాయిలు. వారిని చదివించుకోవాలి. నా భర్త ఆరోగ్యం బాగుండడం లేదు. ఆయనకూ సరైన పని దొరకడం లేదు. మేం ఎట్లా బతకాలి? మాలో ఒకరు చనిపోయారు. ఇప్పుడా కుటుంబం కూలీపనులకు వెళ్తున్నది. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రావద్దు. కనీసం మమ్మల్ని ప్రతి నెలా వేతనం ఇచ్చే ఏ శాఖకు పంపినా పని చేస్తాం. మా గురించి కొత్త ప్రభుత్వం ఆలోచించాలి. ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేశాం. ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా మా గురించి ఎంక్వయిరీ చేశారు. ఇప్పటికైనా మాకు న్యాయం జరుగుతుందని ఆశతో ఎదురుచూస్తున్నాం.

Tags:    

Similar News