మహాధర్నాతో అట్టుడికిన విద్యుత్ సౌధ

విద్యుత్ సంస్థలు తీసుకున్న నిర్ణయంతో బీసీ, ఓసీ ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతోందని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ తో తెలంగాణ ఎలక్ట్రిసిటీ బీసీ, ఓసీ ఎంప్లాయిస్ జేఏసీ నేతలు మహాధర్నాకు దిగారు.

Update: 2024-09-04 17:43 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : విద్యుత్ సంస్థలు తీసుకున్న నిర్ణయంతో బీసీ, ఓసీ ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతోందని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ తో తెలంగాణ ఎలక్ట్రిసిటీ బీసీ, ఓసీ ఎంప్లాయిస్ జేఏసీ నేతలు మహాధర్నాకు దిగారు. దీంతో విద్యుత్ సౌధ అట్టుడికిపోయింది. విద్యుత్ ఉద్యోగులకు కల్పించిన పదోన్నతులపై న్యాయవిచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మహాధర్నాలో భాగంగా తెలంగాణ ఎలక్ట్రిసిటీ బీసీ, ఓసీ ఎంప్లాయిస్ జేఏసీ నేతలు మాట్లాడుతూ.. ట్రాన్స్ కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సంస్థల్లో పనిచేస్తున్న వేలాది మంది బీసీ, ఓసీ ఉద్యోగులకు నష్టం కలిగించేలా పదోన్నతులు కల్పిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఆదేశాలను, సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులను అమలుచేయకుండా కొన్ని సంవత్సరాలుగా కండీషన్ల పేరిట పదోన్నతులు కల్పించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. యాజమాన్యాల తీరును వ్యతిరేకిస్తూ విద్యుత్ సంస్థల్లో 35 వేలకు పైగా పనిచేస్తున్న బీసీ, ఓసీ ఉద్యోగులకు సత్వరం న్యాయం చేయాలని సంస్థలను, రాష్ట్ర ప్రభుత్వాన్ని పలుమార్లు కోరినా తమకు న్యాయం జరగలేదన్నారు. మహాధర్నా చేపట్టబోతున్నట్టు యాజమాన్యాలకు, ప్రభుత్వానికి తెలిపినా కూడా యాజమాన్యాలు సుమారుగా 3830 మంది ఉద్యోగులకు మరో కొత్త కండీషన్ తో అడ్‌హక్ పద్ధతిలో పదోన్నతులు కల్పించి కొత్త విధానానికి తెరలేపిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోని యాజమాన్యాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగులకు సంబంధించిన విభజనకు సంబంధించిన సుప్రీంకోర్టులో ధిక్కరణ కేసు ముగించుకునే అంశంలో భాగంగా ఆగమేఘాలపై నవంబర్ 2022లో సుమారుగా 1600 మందికి కండీషన్ల పేరిట పదోన్నతులు కల్పించిందని, అయితే ఇచ్చిన పదోన్నతులను.. ప్రభుత్వ ఉత్తర్వుల, సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల మేరకు సమీక్షించి నష్టపోయిన బీసీ, ఓసీ ఉద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పారన్నారు. కానీ, అందుకు విరుద్ధంగా ప్రస్తుత యాజమాన్యాలు పాత కండీషన్లను పక్కనపెట్టి మరో కొత్త కండీషన్ ను జోడిస్తూ, అడ్‌హక్ పద్ధతిలో ప్రమోషన్లు కల్పించడంపై వారు మండిపడ్డారు. గతంలో విధించిన షరతులు ప్రస్తుతం ఉన్నట్లా? లేనట్లా? అనే అంశంపైనా ఎవరూ క్లారిటీ ఇవ్వడంలేదని తెలిపారు. సీఎండీ రోనాల్డ్ రోస్ సెలవులో ఉన్న సమయంలో పదోన్నతులు కల్పించడం బీసీ, ఓసీ ఉద్యోగులకు విస్మయాన్ని కలిగిస్తోందని జేఏసీ నేతలు పేర్కొన్నారు.

డిమాండ్లు ఇవే..

విద్యుత్ సంస్థల్లో కండీషన్ల పేరిట కల్పిస్తున్న పదోన్నతులపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా జ్యుడీషియల్ ఎంక్వైరీ జరిపించి చర్యలు తీసుకోవాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థల్లో 2014 జూన్ 2 నుంచి కల్పించిన అన్ని పదోన్నతులను హైకోర్టు ఉత్తర్వుల ఆధారంగా సమీక్షించి నష్టపోయిన బీసీ, ఓసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలన్నారు. విద్యుత్ సంస్థల్లో నేరుగా నియామకమవుతున్న ఉద్యోగుల సీనియారిటీని మెరిట్ ఆధారంగా నిర్ధారించి సీనియారిటీని ప్రకటించాలని పట్టుపట్టారు. విద్యుత్ సంస్థల్లో జూనియర్ లైన్ మెన్ స్థాయి నుంచి చీఫ్ ఇంజినీర్ స్థాయి వరకు అన్ని కేడర్లలో తుది సీనియారిటీలను వెంటనే ప్రకటించి ఉద్యోగులకు తెలియజేయాలన్నారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టీజన్ ఉద్యోగులకు ఏపీఎస్‌ఈబీ రూల్స్ వర్తింపజేసి విద్యార్హతల ఆధారంగా పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను ఇప్పటికైనా ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి భట్టి, ఇంధనశాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్ ప్రత్యేక చొరవ చూపి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే సమ్మెకు కూడా వెనుకడుగు వేయబోమని హెచ్చరించారు. మహాధర్నాలో జేఏసీ చైర్మన్ కోడెపాక కుమార స్వామి, కో చైర్మన్ ఆర్ సుధాకర్ రెడ్డి, కన్వీనర్ మొత్యం వెంకన్న గౌడ్, కో కన్వీనర్ భాను ప్రకాష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నీలారపు రాజేందర్, సోమయాజులు, ఎం విజయ కుమార్, పీ యాదగిరి, మారం శ్రీనివాస్, జీ బ్రహ్మేంద్ర రావు, ఎన్ సదానందం, ఎం అశోక్ కుమార్, సంపత్ రెడ్డి కొమరవెల్లి రవీందర్, డాక్టర్ చంద్రుడు, ప్రేమ్ కుమార్, ప్రవీణ్ కుమార్, రంగు సత్యనారాయణ, సామల శివాజి, యజ్ఞప్రసాద్, ఆడెపు శ్రీకాంత్, వెంకటేష్, పిల్లి అశోక్, కిశోర్, మధు, తదితరులు పాల్గొన్నారు.


Similar News