నాకు ఓబీసీ కన్వీనర్ పోస్టు ఇవ్వండి : మాజీ ఎంపీ వి హనుమంతరావు

తనకు ఓబీసీ కన్వీనర్ గా అవకాశం ఇస్తే, దేశమంతా తిరుగుతానని మాజీ ఎంపీ వి హనుమంతరావు పేర్కొన్నారు.

Update: 2024-08-14 17:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : తనకు ఓబీసీ కన్వీనర్ గా అవకాశం ఇస్తే, దేశమంతా తిరుగుతానని మాజీ ఎంపీ వి హనుమంతరావు పేర్కొన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ... దేశంలో ఎక్కడ బీసీలకు అన్యాయం జరిగినా, అక్కడికి వెళ్లి న్యాయం కోసం పోరాడుతానని వెల్లడించారు. తనకు రెండు సార్లు సీఎం అవకాశం వచ్చినా తీసుకోలేదని, తనకు పదవులు ముఖ్యం కాదని వెల్లడించారు. పార్టీ, ప్రజల కోసం పనిచేసే వ్యక్తినని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని కావాలనేదే తన ఏకైక లక్ష్యమన్నారు. తాజాగా జరిగిన ఏఐసీసీ మీటింగ్ లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లి కార్జునఖర్గేలు కులగణన చేయాలని చెప్పారని, ఇది జరిగితే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. 1931లో కులగణన జరిగిందని, మళ్ళీ ఇప్పటి వరకు జరగలేదన్నారు. బీజేపీ పార్టీ తప్ప, అన్ని రాజకీయ పార్టీలు కులగణన చేయాలంటున్నాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కులగణన బిల్ పెట్టారన్నారు. ఇందుకోసం రూ.150 కోట్లు బడ్జెట్ ను కూడా కేటాయించారన్నారు. గతంలో తాను ఓబీసీ ఎంపీల కన్వీనర్ గా కోట్లాడి మరి ఐఐటీ, ఐఐఎంలలో రిజర్వేషన్లు తీసుకువచ్చానని వెల్లడించారు. దాని ఫలితంగానే ఇప్పుడు చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు.


Similar News