తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేయాలి : తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి

తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (టాస్) ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.

Update: 2024-09-23 14:33 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (టాస్) ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. సోమవారం హైదరాబాద్ లో తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. కేరళ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తరహా లో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కొన్ని కార్పొరేషన్ ఎండీలుగా గ్రూప్-1 అధికారులను నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 2015 లో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటుపై అధ్యయనానికి ఆరుగురు ఐఏఎస్ అధికారులతో ప్రభుత్వం కమిటీ వేసిందని, కానీ ఇప్పటికీ ఐఏఎస్ అధికారుల కమిటీ ప్రభుత్వానికి తమ తుది నివేదికను సమర్పించలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల కొరత దృష్ట్యా ప్రతిభావంతులైన గ్రూప్ 1 అధికారులను కార్పొరేషన్ ఎండీలుగా, స్థానిక సంస్థల్లో అనుభవం ఉన్న గ్రూప్ -1 అధికారులను స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్లుగా నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. త్వరలో సీఎంను, చిన్నారెడ్డి కమిటీని, ప్రభుత్వప్రధాన కార్యదర్శిని కలిసి తమ సమస్యలను విన్నవిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ గ్రూప్ -1 ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హనుమంతు నాయక్ , వివిధ శాఖల గ్రూప్ 1 అధికారులు వేణుమాధవ్ రెడ్డి, సయ్యద్ యాసీన్ ఖురేషి, అలోక్ కుమార్, అంజన్ రావు, అజయ్, భవాని, శశిశ్రీ, పద్మజారాణి, పద్మావతి, వినయ్, సోమశేఖర్, నూతనకంటి వెంకట్, శరత్ చంద్ర, శ్రీరామ్, వినోద్ రెడ్డి, షబానా, మైత్రి ప్రియ తదితరులు పాల్గొన్నారు.


Similar News