బీసీ రిజర్వేషన్ల 42 శాతానికి పెంపు సాధ్యమే : జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య

బీసీ రిజర్వేషన్లు 42శాతం పెంపుదల ముమ్మాటికీ సాధ్యమేనని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య స్పష్టం చేశారు.

Update: 2024-09-23 14:16 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : బీసీ రిజర్వేషన్లు 42శాతం పెంపుదల ముమ్మాటికీ సాధ్యమేనని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య స్పష్టం చేశారు. అది ప్రభుత్వ చిత్తశుద్ధిపై ఆధారపడి ఉన్నదని పేర్కొన్నారు. బీసీ ముఖ్య నేతలతో హైదరాబాద్ లోని ఓ హోటల్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అధికార కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్, హామీలు, స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్ల కల్పన, సమగ్ర కులగణన, న్యాయపరమైన సాధ్యాసాధ్యాలను కూలంకుషంగా చర్చించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ ప్రభుత్వాలకు నిజాయితీ ఉంటే సాధ్యమవుతుందని వెల్లడించారు. సమగ్ర కుల గణన, బీసీలకు స్థానిక సంస్థల్లో 42 రిజర్వేషన్లపై బీఆర్ఎస్ పోరాటం అభినందనీయమన్నారు. ప్రజలను చైతన్య వంతులను చేయాలని నేతలకు సూచించారు. మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి మాట్లాడుతూ దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న మనకు అన్ని రంగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యా, ఉద్యోగ,రాజకీయ రంగాల్లో మన న్యాయమైన వాటా,హక్కుల సాధనకు మరింత ఐకమత్యంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. బీసీల సంక్షేమం, సముద్ధరణ,ఆయా రంగాలలో రిజర్వేషన్స్ అమలు తదితర అంశాలపై అధ్యయనానికి పలు రాష్ట్రాలలో పర్యటించనున్నట్లు తెలిపారు. న్యాయమైన,ధర్మమైన మన హక్కుల్ని,వాటాను దక్కించుకునేందుకు తెలంగాణ ఉద్యమం స్పూర్తితో ‘మేమెంతో మాకంతా’,‘మా వాటా మాకే’అనే నినాదాలతో పోరాటాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని నిర్ణయించామన్నారు. ఈ సమావేశంలో నాయకులు కర్నె ప్రభాకర్, గంగాధర్ గౌడ్, చెరుకు సుధాకర్, పల్లె రవి కుమార్ గౌడ్, డాక్టర్ ఆంజనేయ గౌడ్, డాక్టర్ చిరుమల్ల రాకేశ్, జి నాగేందర్ గౌడ్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు బూడిద బిక్షమయ్య గౌడ్, నోముల భగత్, బీసీ కమీషన్ మాజీ సభ్యులు కిశోర్ గౌడ్, ఉపేంద్ర చారి, శుభప్రద్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. 


Similar News