Minister Thummala: విలీన గ్రామాల అభివృద్ధికి పకడ్బందీ చర్యలు

ఖమ్మం నగరంలోని విలీన గ్రామాల అభివృద్ధికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Update: 2024-09-23 14:00 GMT

దిశ, ఖమ్మం : ఖమ్మం నగరంలోని విలీన గ్రామాల అభివృద్ధికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్ అల్లీపురంలో టి.యు.ఎఫ్.ఐ.డి.సి నిధులు రూ. 35 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి సోమవారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... నగరంలో ఉంటే అభివృద్ధికి అధిక నిధులు వస్తాయని గతంలో ప్రభుత్వాలను ఒప్పించి విలీనం చేసి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పట్టణంలో ఉన్న సౌకర్యాలు ప్రజలకు అందాలని, అన్ని కాలనీలలో కూడా సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఉండాలని అన్నారు. మంచినీటి సరఫరా, విద్య, వైద్య సౌకర్యాలు అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో పని చేశామని అన్నారు.

నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ కు అనుగుణంగా రోడ్లను డబుల్, ఫోర్ లైన్ రోడ్లుగా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. జాతీయ రహదారులు ఖమ్మం పట్టణానికి రాకుండా, నేరుగా ఇతర జిల్లాలకు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దేవరపల్లి, రాజమండ్రి, అమరావతి, విజయవాడ జాతీయ రోడ్లు త్వరలో వస్తాయని, వీటి ద్వారా ఖమ్మం చుట్టూ రింగ్ రోడ్డు వచ్చే అవకాశం ఉందని అన్నారు. జాతీయ రోడ్లకు సర్వీస్ రోడ్లు వేసి ఖమ్మం పట్టణానికి మరింత వెసులుబాటు తీసుకొని వస్తామని అన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ విలీన గ్రామాల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు.

మన రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చిన హామీ మేరకురూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని మంత్రి తెలిపారు. తెల్ల రేషన్ కార్డు లేని రైతులను కుటుంబ సర్వే ద్వారా నిర్ధారణ చేసి, రుణమాఫీ పథకం వర్తింపు చేస్తామని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి సంవత్సరంలోనే రూ. 31 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ మాత్రమేనని అన్నారు. రుణమాఫీ పథకం తర్వాత రైతు భరోసా పథకం అమలు అవుతుందని అన్నారు. రైతుల పంటలకు కూడా పంటల బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి తెలిపారు. రోజుకు రూ. 50 కోట్లు ఖర్చు చేసి రైతులకు నిరంతరాయ విద్యుత్ సరఫరా చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ, 15వ డివిజన్ కార్పొరేటర్ రావూరి కరుణ, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, సహాయ కమిషనర్ సంపత్, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సిహెచ్. స్వామి, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Similar News