Uttam Kumar Reddy: ప్రభుత్వ నిర్ణయాలతోనే అగ్రభాగాన రియల్ ఎస్టేట్: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ మరో భూమ్‌గా మారబోతున్నదని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ మరో భూమ్‌గా మారబోతున్నదని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ)లో ‘తెలంగాణ గోయింగ్ గ్లోబల్’ అనే థీమ్‌తో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా రాష్ట్ర సదస్సుకు మంత్రి ఉత్తమ్ హజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మకమైన నిర్ణయాలతో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం మరింత అగ్రభాగాన చేరనుందని అన్నారు.
నిర్మాణ రంగంలోనూ గణనీయమైన వృద్ధి కనిపిస్తోందని తెలిపారు. సిటీ అన్ని వైపుల డెవలప్‌మెంట్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని మౌలిక సదుపాయాల కల్పనకు ఏకంగా రూ.10వేల కోట్లు కేటాయించిందని అన్నారు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, 162 కి.మీ పొడవైన నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే, హైదరాబాద్ మెట్రో రైలు, తాగునీటి సరఫరా వంటి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు పునాది వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని ఆయన కొనియాడారు.
కృష్ణా, గోదావరి ఉభయ నదుల నుంచి నీటిని హైదరాబాద్‌కు తీసుకొచ్చిన ఘనత కుడా ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో హైదరాబాద్‌కు ముచ్చెర్ల వద్ద ఫ్యూచర్ సిటీ, స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ, మెట్రో రైల్ విస్తరణ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులతో సహా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్, తదితరులు పాల్గొన్నారు.