ప్రజలకు మీరేం చేశారు? ఇకనైనా మోసపూరిత హామీలను కట్టిపెట్టండి : Union minister kishan reddy
రాష్ట్రంలోని పట్టణాల పునరుజ్జీవనానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని పట్టణాల పునరుజ్జీవనానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందే.. కేంద్ర ప్రభుత్వ నిధులతో అని కిషన్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాని మోడీ 25 జూన్ 2015 న జాతీయ స్మార్ట్ సిటీస్ మిషన్, అటల్ మిషన్ ఫర్ రెజువినేషన్, అర్బర్ ట్రాన్స్ ఫర్మేషన్(అమృత్), ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ (పీఎంఏవై-యూ) వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ప్రారంభించారని తెలిపారు. స్మార్ట్ సిటీస్ మిషన్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 100 నగరాలను ఎంపిక చేసి ఆయా నగరాల్లో అభివృద్ధి చేపడుతున్నట్లు చెప్పారు.
తెలంగాణ నుంచి వరంగల్, కరీంనగర్ పట్టణాలు ఎంపికైనట్లు పేర్కొన్నారు. స్మార్ట్ సిటీస్ మిషన్ కింద వరంగల్ కు రూ. 500 కోట్లు, కరీంనగర్ కు రూ.500 కోట్లు కేంద్రం కేటాయించినట్లు స్పష్టంచేశారు. స్మార్ట్ సిటీస్ మిషన్ పథకం క్రింద 50:50 రేషియోలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఉంటుందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ నిధులను విడుదల చేయడంలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు వరంగల్‌కు రూ.50 కోట్లు, కరీంనగర్ కు రూ.186 కోట్లను మాత్రమే విడుదల చేసిందని ఆయన పేర్కొన్నారు. మ్యాచింగ్ గ్రాంట్ నిధులను విడుదల చేయడంలో తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. అంతేకాకుండా కేంద్రం విడుదల చేసిన నిధులను ఆయా నగరాల మునిసిపల్ కార్పొరేషన్లకు బదిలీ చేయడంలోనూ అలసత్వం వహించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమృత్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 500 పట్టణాలను ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం ఆయా పట్టణాల్లో పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందని ఆయన చెప్పారు. ఎంపికైన పట్టణాల్లో నీటి సరఫరా, మురుగునీటి పారుదల, తుఫాను నీటి పారుదల, పట్టణ రవాణా, ఉద్యానవనాల అభివృద్ధి వంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని 12 పట్టణాలకు రూ.833.36 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. కాగా 2021లో అమృత్ 2.0 పథకాన్ని ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా 143 పట్టణాలను ఎంపిక చేసి నిధులు కేటాయించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. 143 పట్టణాల అభివృద్ధికి రూ.2,780 కోట్లతో అభివృద్ధి చేయనున్నారని పేర్కొన్నారు. పలు ప్రాజెక్టుల డీపీఆర్ లు అందించడానికి ఇప్పటికే రూ.100 కోట్ల నిధులను విడుదల చేసినట్లు ఆయన తెలిపారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ.4,465.81 కోట్లను మంజూరు చేయగా ఇప్పటివరకు రూ.3,128.14 కోట్లను విడుదల చేసిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రానికి 2,49,465 ఇళ్లను మంజూరు చేయగా, 2,39,422 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, అందులో 2,15,443 ఇళ్ళు నిర్మాణం పూర్తి చేసుకున్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి చేపట్టిన ఇండ్ల నిర్మాణ పనులు నివేదికల లెక్కలకు, వాస్తవిక లెక్కలకు పొంతన లేకుండా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇచ్చిన నిధులను సరైన రీతిలో వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శలు చేశారు. గతంలో సొంత ఇంటి కోసం రూ.5 లక్షల ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు రూ.3 లక్షలే ఇస్తామని చెబుతూ, అందులో కూడా అనేక నిబంధనలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.