రైతు సదస్సుకు సర్వం సిద్ధం..! 150కి పైగా స్టాళ్ల ఏర్పాటు

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా విజయోత్సవాల్లో భాగంగా ఈనెల 28 నుంచి మూడు రోజుల పాటు భూత్పూర్ మున్సిపల్ కేంద్రంలో జరగనున్న రైతుసభ వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

Update: 2024-11-27 02:25 GMT

దిశ, మహబూబ్‌నగర్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా విజయోత్సవాల్లో భాగంగా ఈనెల 28 నుంచి మూడు రోజుల పాటు భూత్పూర్ మున్సిపల్ కేంద్రంలో జరగనున్న రైతుసభ వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సారథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులు సమావేశమై కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేసేందుకు అవసరమైన సమాలోచనలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా కావడంతో కార్యక్రమాన్ని రాష్ట్ర చరిత్రలో నిలిచేలా నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి.

మూడు రోజులు.. 150 స్టాళ్లు

భూత్పూర్ మున్సిపల్ కేంద్రం మహబూబ్‌నగర్ రోడ్డు అమిస్తాపూర్ గ్రామ సమీపంలో సువిశాలమైన స్థలంలో రైతు సభను నిర్వహిస్తున్నారు. దాదాపుగా 1,50,000 మంది రైతులు కార్యక్రమానికి హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. వ్యవసాయ రంగం, అనుబంధ సంస్థలకు సంబంధించి మొత్తం 150‌కి పైగా స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. రైతు సదస్సు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభం కానుంది. కాగా, చివరి రోజు రైతుసభ ముగింపు సమావేశం ఈ నెల 30న జరగనుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన రుణ మాఫీ, తదితర కార్యక్రమాలను గురించి వివరించనున్నారు. దీంతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లా కరువు తీరా ప్రాజెక్టు పనుల పూర్తికి తీసుకుంటున్న చర్యలను గురించి స్పష్టంగా చెప్పే అవకాశం ఉంది.

ప్రధానంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులతో పాటు పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు, మక్తల్- కొడంగల్ నియోజకవర్గ ఎత్తిపోతల పథకంపై ముఖ్యమంత్రి స్పష్టతను ఇచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసం తమ ప్రభుత్వం మున్ముందు తీసుకుంటున్న అంశాలపై సీఎం స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. మూడు రోజుల పాటు నిర్వహించనున్న రైతు సభకు సంబంధించిన ఏర్పాట్లు భారీ ఎత్తున సాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరయ్యే రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు భోజన సౌకర్యాలను కల్పించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.


Similar News