Hyd Traffic: ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్ జెండర్లు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణ విషయంలో ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ చేయడంలో ట్రాన్స్ జెండర్ లను వాలంటీర్స్ గా ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హోమ్ గార్డ్స్ తరహాలో వారికి ఉపాధి కల్పించే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ఆసక్తి ఉన్నవారి వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ రివ్యూకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు, ఫుట్ పాత్ ల అభివృద్ధి, పారిశుద్ధ్యం, ఇతర పనుల్లో పురోగతిపై ముఖ్యమంత్రి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. టెండర్లు దక్కించుకున్న వారు పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్లను ఉపేక్షించవద్దని, ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా పనులు పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. పనులు చేయని కాంట్రాక్టర్లకు సంబంధించి పూర్తిస్థాయి రిపోర్ట్ 15 రోజుల్లోగా అందించాలన్న సీఎం.. తప్పుడు రిపోర్టులు ఇచ్చే అధికారులపైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.