Malakpet Govt Hospital Incident : ఘటనపై రేవంత్ రెడ్డి సీరియస్

వైద్యం వికటించి మలక్ పేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు మృతి చెందడం అత్యంత దారుణం అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.

Update: 2023-01-13 08:09 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: వైద్యం వికటించి మలక్ పేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు మృతి చెందడం అత్యంత దారుణం అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని కల్వకుర్తికి చెందిన సిరివెన్నెల, సైదాబాద్ కు చెందిన శివానిలు చికిత్స పొందుతూ వైద్యం వికటించి మృత్యువాత పడటం ఇది హృదయ విదారకరమైన ఘటన అని విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు కడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం కనీసం బాలింతలను కాపాడలేకపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి నగరం అని చెప్పుకుంటున్న హైదరాబాద్ లో ఇంత ఘోరమా? అని ప్రశ్నించారు.

రోజు రోజుకు ప్రభుత్వ వైద్యంపై పూర్తిగా నమ్మకం పోతోందని ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ అపరేషన్ లో ఆపరేషన్ వికటించి నలుగురు బాలింతలు చనిపోయారు. ఆగస్టు చివరి వారంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి బాలింతలు మృత్యువాత పడ్డారు. 4 నెలలోపే మళ్ళీ ఈ సంఘటన జరిగింది. హైదరాబాద్ లోనే ఇలా ఉంటే ఇక మారుమూల పల్లెల్లో, అటవీ ప్రాంతాల్లో పరిస్థితి ఏమిటని నిలదీశారు. ప్రభుత్వ ఆసుపత్రులు అంటేనే ప్రజలు జంకే పరిస్థితి వచ్చిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మాటలకే పరిమితం అయ్యారని విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రులను సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్లే రాష్ట్రంలో ప్రైవేట్ వైద్యం అభివృద్ధి చెందుతోందని ఆరోపించారు. మలక్ పేట ఘటనకు బాధ్యత వహిస్తూ హరీష్ రావు తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News