పాలమూరులో వైభవంగా రైతు పండగ.. నేటి నుంచి 30 వరకు ఉత్సవాలు

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నేటి నుంచి మూడు రోజుల పాటు ‘రైతు పండుగ’ నిర్వహించనున్నారు.

Update: 2024-11-28 03:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నేటి నుంచి మూడు రోజుల పాటు ‘రైతు పండుగ’ నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో అన్ని జిల్లాల నుంచి రైతులను భాగస్వామ్యం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభసాటి విధానాలు, వివిధ పంట ఉత్పత్తులపై రైతులకు అవగాహన కల్పించేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో 25 విభాగాల ఆధ్వర్యంలో 150 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. అగ్రికల్చర్ సైంటిస్టులు సైతం హాజరై స్టాళ్ల పరిశీలనతో పాటు రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించనున్నారు.

వరి సాగులో దేశంలోనే మొదటి స్థానం

వరిసాగు విస్తీర్ణంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. రాష్ట్ర వ్యా్ప్తంగా 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 153 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రైతులకు ఒకే సారి రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేసింది. ఈ పథకం ద్వారా సుమారు 22.22 లక్షల మంది రైతుల కుటుంబాలకు దాదాపు రూ.17,870 కోట్ల రుణమాఫీ జరిగింది. అంతే కాకుండా ఈ ఏడాదిలో రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్తు కోసం ప్రభుత్వం రూ.10,444 కోట్లు సబ్సిడీగా చెల్లించింది. రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు గతంలో కంటే ఎక్కువ కొనుగోలు కేంద్రాలను ఈ సారి సర్కారు ఏర్పాటు చేసింది. రైతులు ధాన్యం అమ్మి నెలల కొద్దీ ఎదురు చూడకుండా డబ్బులు వేగంగా చెల్లించి రికార్డు సృష్టించింది. వ్యవసాయ రంగం అభివృద్ధి, సలహాలు, సూచనల కోసం కోదండరెడ్డి సారధ్యంలో వ్యవసాయ కమిషన్‌ను సైతం ఏర్పాటు చేసింది.

‘పంటల బీమా’ పునరుద్ధరణ

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంటల బీమాను ఎత్తేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించింది. రైతుల తరఫున పంటల బీమా ప్రీమియం చెల్లించేందుకు సర్కారు రూ.1,300 కోట్లు కేటాయించింది. జీవిత బీమా కంపెనీకి రైతుబీమా పథకం ప్రీమియంగా రూ.1,455 కోట్లు చెల్లించింది. రైతులకు సలహాలు, సూచనలు అందించేందుకు, అధికారులు నేరుగా క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడి పరిస్థితులు తెలుసుకునేందుకు ‘రైతు నేస్తం’ పథకాన్ని అమలు చేసింది. అన్ని రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లు అమర్చనుంది. తొలి విడతగా 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,601 రైతు వేదికల నుంచి రైతులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడేలా ఏర్పాట్లు చేసింది.

వివిధ పథకాలకు సర్కార్ కేటాయించిన నిధులు ఇలా..

రైతు రుణమాఫీ -   రూ.17,869 కోట్లు

రైతు బంధు -    రూ.7,625 కోట్లు

రైతు బీమా -  రూ.1,455 కోట్లు

పంటల బీమా  - రూ.1,300 కోట్లు

ఉచిత విద్యుత్ - రూ.10,444 కోట్లు

2023-24 ధాన్యం కొనుగోళ్లు  -  రూ.10,547 కోట్లు

ధాన్యం కొనుగోళ్లకు  - రూ.5,040 కోట్లు

-------------------------------------------

మొత్తం: రూ. 54,280 కోట్లు

Tags:    

Similar News