BRS: 30 నుంచి బీఆర్ఎస్ ‘గురుకులాల బాట’
రాష్ట్రంలోని గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ కారణంగా పలువురు విద్యార్థులు మృతి చెందుతున్న నేపథ్యంలో ఆయా విద్యాసంస్థల్లో నెలకొన్న పరిస్థితులను తెలుసుకునేందుకు బీఆర్ఎస్ ‘గురుకులాల బాట’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ కారణంగా పలువురు విద్యార్థులు మృతి చెందుతున్న నేపథ్యంలో ఆయా విద్యాసంస్థల్లో నెలకొన్న పరిస్థితులను తెలుసుకునేందుకు బీఆర్ఎస్ ‘గురుకులాల బాట’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఈ నెల 30 నుంచి వచ్చేనెల 7 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో కమిటీని వేస్తున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం మీడియా ప్రకటనలో తెలిపారు. సభ్యులుగా డాక్టర్ ఆంజనేయులు గౌడ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, రాజారామ్ యాదవ్, వాసుదేవ రెడ్డి ఉంటారు. గురుకుల బాటలో భాగంగా రాష్ట్రంలోని అన్ని గురుకులాలతో పాటు కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్, రెసిడెన్షియల్ కాలేజీలను సందర్శించనున్నారు. అక్కడ నెలకొన్న పరిస్థితులను అధ్యయనం చేయనున్నారు.
11నెలల పాలనలో 48 మంది మృతి : కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రాష్ట్ర వ్యాప్తంగా 48మంది విద్యార్థులు మృతి చెందడం బాధాకరమని కేటీఆర్ అన్నారు. ఏడాదిలో 38 సార్లు ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగాయని తెలిపారు. కమిటీ నివేదిక తరువాత ఆ అంశాలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ వెల్లడించారు.