‘ఎంటర్ ది డ్రాగన్’..! కవిత రాకతో బీఆర్ఎస్‌లో హాట్ డిస్కషన్స్

బీఆర్ఎస్‌లో మొన్నటి వరకు మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ మాత్రమే కీలకం.

Update: 2024-11-28 02:12 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్‌లో మొన్నటి వరకు మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ మాత్రమే కీలకం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం, ప్రెస్‌మీట్స్ నిర్వహణ, కార్యకర్తలతో సమావేశాలన్నీ వీరిద్దరే చూసేవారు. వారి కనుసన్నల్లోనే పార్టీ కార్యక్రమాలన్నీ జరుగుతూ వస్తున్నాయి. ఇద్దరి గైడ్‌లైన్స్ మేరకే లీడర్లు క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత ఎంటర్ కావడంతో బీఆర్ఎస్‌లో మూడో ఉద్యమ సెంటర్ తయారైందని డిస్కషన్ సాగుతున్నది. పార్టీలో ఉన్న ఆమె ఫాలోవర్స్ సైతం యాక్టివ్ అయ్యారు. కవితతో రెగ్యూలర్‌గా టచ్‌లో ఉంటూ ఆమె ఇస్తున్న గైడ్‌లైన్స్ మేరకు పని చేసేందుకు రెడీ అవుతున్నారు. త్వరలో కవిత జిల్లా పర్యటనలకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తున్నది.ః

కవితలో కొత్త ఉత్సాహం

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత ఐదు నెలల పాటు జైలులో ఉన్నారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆమె మూడు నెలల పాటు ఇంటికే పరిమితమయ్యారు. ఎలాంటి రాజకీయాల జోలికీ వెళ్లలేదు. ఏ పొలిటికల్ ఘటనపైనా మాట్లాడలేదు. చివరికి పార్టీకి చెందిన లీడర్లను సైతం కలవలేదు. ఈ మధ్యే బయటికి వచ్చిన ఆమె తాజా రాజకీయాలపై స్పందిస్తున్నారు. తన సొంత సంస్థ జాగృతి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కులగణనను త్వరగా పూర్తి చేసి స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు ఫైనల్ చేయాలని స్వయంగా బీసీ డెడికేషన్ కమిషన్‌కు వినతి పత్రం అందజేశారు. ఇప్పటి వరకు హాజరైన ప్రోగ్రామ్స్‌లో కవిత మాట్లాడుతున్న తీరును పరిశీలిస్తే ఆమెలో కొత్త ఉత్సాహం కనిపిస్తుందనే డిస్కషన్ రాజకీయ విశ్లేషకుల మధ్య జరుగుతున్నది.

ముగ్గురితో లాభమా.. నష్టమా?

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ సింగిల్ డైరెక్షన్‌లో పని చేయడం బెటర్ అని తలలు పండిన రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. కానీ బీఆర్ఎస్‌లో ఇప్పుడు మూడు ఉద్యమ సెంటర్లు పని చేయడం వల్ల పార్టీకి లాభమా.. నష్టమా? అనే డిస్కషన్ మొదలైంది. హరీశ్‌రావు, కేటీఆర్, కవిత ముగ్గురిదీ మూడు భిన్నమైన వైఖరి అనే టాక్ ఉన్నది. హరీశ్ నిర్ణయాలు వ్యూహాత్మకంగా ఉంటాయని, ఏం చేసినా ఓ ప్లాన్ ప్రకారం చేస్తుంటారనే పార్టీ లీడర్లు చెబుతుంటారు. కేటీఆర్ దూకుడు స్వభావిగా ఉంటారని, ముందు వెనుక ఆలోచించకుండా మాట్లాడుతుంటారని, కొన్ని సార్లు ఇబ్బందులూ తెచ్చుకుంటారని టాక్ ఉన్నది. ఇక కవిత మాత్రం ఆ ఇద్దరికీ భిన్నంగా కనిపిస్తుంటారని, వ్యూహాత్మక నిర్ణయాలతో పాటు ఆచితూచి అవసరం మేరకు మాత్రమే మాట్లాడుతుంటారని చర్చ లీడర్లలో టాక్ ఉన్నది. ఈ భిన్నమైన ముగ్గురి వ్యక్తిత్వాలతో పార్టీకి మేలు కంటే నష్టం తెచ్చే ప్రమాదమూ లేక పోలేదనే విమర్శలు సైతం పార్టీ లీడర్ల నుంచి వస్తున్నాయి.

బీఆర్ఎస్‌లో కవితకు ప్రత్యేక స్థానం

గులాబీ పార్టీలో హరీశ్, కేటీఆర్ కంటే కవితకు ప్రత్యేక స్థానం ఉందని ప్రచారం ఉంది. పార్టీ లీడర్, కేడత్‌తో సంబంధం లేకుండానే గతంలోనే జాగృతి సంస్థతో ఆమె పలు కార్యక్రమాలు నిర్వహించారు. భవిష్యత్‌లో సైతం మరిన్ని కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే పార్టీలో తనకంటూ ఓ టీమ్ తయారు చేసుకున్నారని, భవిష్యత్‌లో అది మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయనే డిస్కషన్ మొదలైంది. మరోవైపు కేటీఆర్ కంటే కవితకే ఎక్కువ మాస్ ఫాలోయింగ్ ఉంటుందని, ఆమెలో కనిపించే చనువు, మాటతీరు ప్లస్‌గా ఉంటాయని నేతలు చెబుతున్నారు. పార్టీ పవర్‌లో ఉన్నప్పుడు కవితలో ఆడంబరం, ఆమె చుట్టూ ఉన్న అనుచరుల వీరంగం అంతా ఇంతా కాదని కేడర్ ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంటారు.

సీఎం కామెంట్స్‌తో సోషల్ మీడియాతో చర్చ

ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి.. కేటీఆర్‌పై సెటైర్లు వేస్తూ ‘ జైలుకు వెళ్లేందుకు కేటీఆర్ ఉత్సాహం చూపుతున్నారు. జైలుకు వెళ్లినోళ్లంత లీడర్లు అవుతారని ఆశ పడుతున్నాడు. కానీ ఆయక కంటే ముందే ఆయన చెల్లి కవిత జైలుకు వెళ్లింది. ఆయనకు ఆ చాన్స్ కూడా లేదు’ అని కామెంట్స్ చేశారు. సీఎం కామెంట్స్ తర్వాత భవిష్యత్‌లో కవిత ముఖ్యమంత్రి అవుతారని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. మరి కేటీఆర్ భవిష్యత్ ఏంటీ? అనే డిస్కషన్ సైతం జోరుగా సాగుతున్నది.

బాస్ డైరెక్షన్ మేరకు ముగ్గురు కార్యక్రమాలు!

మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుత రాజకీయాల జోలికి రాకుండా కేవలం ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యారు. దీంతో హరీశ్‌రావు, కేటీఆర్ మధ్య పోటా పోటీ కార్యక్రమాలు కొనసాగాయని చర్చ ఉంది. ఒకరు ప్రెస్‌మీట్ పెడితే మరొకరు ఎక్స్ వేదికగా స్పందించడం, ఒకరు కార్యకర్తలతో మీటింగ్ పెడితో మరొకరు చిట్‌చాట్ చేయడం, ఒకరు ఉత్తర తెలంగాణలో పర్యటిస్తే, మరొకరు దక్షిణ తెలంగాణలో ప్రోగ్రామ్‌కు అటెండ్ కావడం సహజంగా మారేది. ఇప్పుడు కవిత యాక్టివ్‌ కావడం.. ఆమె సొంతంగా ప్రోగ్రామ్స్ డిజైన్ చేసుకుంటే, పార్టీలో మూడు ముక్కలాట తప్పదని, అందుకే ఎవరు ఏం చేయ్యాలో.. మాజీ సీఎం కేసీఆర్.. డిసైడ్ చేస్తారని ఆయనకు సన్నిహితంగా ఉండే ఓ గులాబీ నేత తెలిపారు.

Tags:    

Similar News