Assembly : ప్రభుత్వ వైఫల్యాలే టార్గెట్.. అసెంబ్లీ వేదికగా BRS ప్లాన్ ఇదే..!

అసెంబ్లీ సమావేశాలకు డేట్ ఫిక్స్ కావడంతో బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది.

Update: 2024-07-20 02:11 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ సమావేశాలకు డేట్ ఫిక్స్ కావడంతో బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని భావిస్తోంది. నిరుద్యోగ, ప్రజా, రైతు సమస్యలు, ఎన్నికల హామీలపై నిలదీయడంతో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు పట్టుబట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వ వైఫల్యాలపై స్పీడ్ పెంచి కేడర్‌లోనూ జోష్ నింపి లోకల్ బాడీ ఎన్నికలకు సన్నద్ధం చేయాలని భావిస్తోంది. అయితే అసెంబ్లీ, మండలిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనుసరించాల్సిన వ్యూహాలపై అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నట్లు సమాచారం.

రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రధానంగా ప్రస్తావించేందుకు సిద్ధమవుతున్నారు. రైతుభరోసాను ఎప్పటిలోగా ఇస్తారు? 2లక్షల రుణమాఫీ ఎంతమందికి ఇస్తున్నారు? అనే లెక్కలను బయట పెట్టి సర్కార్‌ను నిలదీసేందుకు వ్యూహాలను రూపొందిస్తున్నారు. అదే విధంగా రైతుబీమా, రూ. 500ల మద్దతు ధర తదితర అంశాలను రైతుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు కేసీఆర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు పట్టుబట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే 10మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడంపై ఒకవైపు స్పీకర్‌కు, మరోవైపు హైకోర్టులో పిల్ వేసింది. ఇదే అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించేందుకు సిద్ధమవుతోంది.

అంతేకాదు.. అసెంబ్లీలో ప్రస్తవించిన అంశాలపైనా విస్తృత ప్రచారం చేయాలని కేడర్‌కు సైతం సంకేతం ఇవ్వనున్నట్లు తెలిసింది. సోషల్ మీడియాలో పోస్టులు చేసి ప్రభుత్వ విధానాలను వివరించాలని పార్టీ భావిస్తుంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు వేయలేదని, గత ప్రభుత్వం నిర్వహించిన వాటికే ఉద్యోగ పత్రాలు ఇచ్చిందనే అంశాన్ని సైతం క్షేత్రస్థాయిలో ప్రచారం చేసేందుకు సిద్ధమవుతోంది. అసెంబ్లీ సమావేశాలను పురస్కరించుకొని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. త్వరలోనే తెలంగాణ భవన్ వేదికగా భేటీ అవుతారని సమాచారం. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా? లేదా? అనేది మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Tags:    

Similar News