ఈ బడ్జెట్ రుణమాఫీ కథ కంచికే : తెలంగాణ రైతు సంఘం
ఎన్నికల మ్యానిఫెస్టోలో రైతాంగానికి ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో శాసన సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ నేరవేర్చేవిధంగా లేదని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ అభిప్రాయపడుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో : ఎన్నికల మ్యానిఫెస్టోలో రైతాంగానికి ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో శాసన సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ నేరవేర్చేవిధంగా లేదని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ అభిప్రాయపడుతున్నది. 2025-26లో వ్యవసాయ రంగానికి రూ.18,101 కోట్లు, పశు సంవర్ధనకు రూ.1,657 కోట్లు, సహకార రంగానికి రూ.158 కోట్లు, అడవుల పెంపకానికి రూ.1,022 కోట్లు, నీటిపారుదల శాఖకు రూ.23,330 కోట్లు కేటాయించారు. బుధవారం ఆసంఘం నేతలు పోతినేని సుదర్శరావు, తీగల సాగర్ఒక ప్రకటనలో పేర్కొంటూ గత సంవత్సరం వ్యవసాయ రంగానికి మాత్రమే రూ.33,493 కోట్లు కేటాయింపు చేశారని, ఈ బడ్జెట్‌ను పరిశీలన చేస్తే రుణమాఫీ కాని రైతులకు ఇక మాఫీ అయ్యే అవకాశం లేదన్నారు. 2024-25 బడ్జెట్‌లో రుణమాఫీకి రూ.15,470 కోట్లు కేటాయించి, రూ.10,611.88 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ బడ్జెట్‌ను గమనిస్తే రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకతకు ప్రోత్సాహం ఇవ్వలేదని, హార్టికల్చర్ అభివృద్ధికి కేటాయింపులు లేవన్నారు.
ఇప్పటికీ రాష్ట్రం కూరగాయలు, పప్పులు, ఉల్లి, వంటనూనెలు, పంచదార దిగుమతులు చేసుకుంటుంది. యాంత్రీకరణకు రూ.25.47 కోట్ల కేటాయింపులు రైతులను ప్రోత్సహించేలా కనబడడం లేదు. రైతు భరోసా కింద రూ.13,603 కోట్లు కేటాయింపు చూపారని, 2024 వానాకాలం రైతు భరోసా నిధులు విడుదల చేయలేదు. యాసంగి పంటల కోత కాలం దగ్గరకు వచ్చినా నిధులు అందరికీ అందలేదని, రాష్ట్రంలోని వ్యవసాయ పరిశోధనల కేంద్రాలకు కేటాయింపులు జాడ లేవన్నారు. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కి గత బడ్జెట్ లో రూ 18.75 కోట్లు కేటాయించి రూ.4.69 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ కి గత బడ్జెట్ లో రూ 4.37 కోట్లు కేటాయించి రూ.1.09 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. జాతీయ ఆహార భద్రత, నూనెగింజల అభివృద్ధి వ్యవసాయ విస్తరణ రాష్ట్రీయ కృషి వికాస్ యోజనలకు కేటాయింపులు లేవు. ఆయిల్ పామ్ తోటల అభివృద్ధి గురించి విస్తృత ప్రచారం చేసినా ప్రభుత్వం అందుకు తగిన నిధులు కేటాయించలేదు. క్రిష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని కోరారు.
రాష్ట్రంలో కౌలు రైతులకు రైతు భరోసా అమలు చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఈ బడ్జెట్‌లో ఆ ప్రస్తావనేలేదని, రుణమాఫీ కాని రైతులందరికీ రుణమాఫీ చేయాలి. నాణ్యతలేని, కల్తీ విత్తన వ్యాపారాన్ని అడ్డుకొని నాణ్యత గల విత్తనాలను రైతులకు సబ్సిడీపై అందించే విధంగా నిధులు కేటాయించాలన్నారు. వ్యవసాయ, హార్టికల్చర్, విశ్వ విద్యాలయాలకు పరిశోధనల కోసం బడ్జెట్‌లో కేటాయింపులు ఉండాలి. సన్న, చిన్న కారు రైతులకు పంటల భీమా పథకానికి రూ.981.11కోట్లు మాత్రమే కేటాయించారు. గత సంవత్సరం కేటాయించినా రూ.981 కోట్లలో ఒక్కరూపాయి ఖర్చు చేయలేదు. ప్రతి ఏటా రూ.4,500 కోట్లు విలువ గల పంటలు ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు నష్టపోతున్నారు. రైతుల భీమాకు మాత్రం రూ.1,167.92కోట్లు మాత్రమే కేటాయించారు. రైతు భీమా పథకాన్ని 18-59 సంవత్సరాలను 18-65 సంవత్సరాలకు పెంచాలి. అన్ని పంటలకు మద్దతు ధరలు నిర్ణయించడానికి రాష్ట్రంలో ధరల నిర్ణాయక కమీషన్ అన్ని పంటలకు ధరలు నిర్ణయించి మార్క్‌ఫెడ్, సివిల్ సప్లయిస్ ద్వారా కొనుగోలు చేయాలి. ఇందుకు మార్కెట్ జోక్యం పథకం కింద కనీసం రూ.3వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించాలి కోరారు.