ఆఫీసర్ల తీరుపై బాధితుడి వినూత్న నిరసన.. ఖాళీ లిక్కర్ బాటిళ్లు, ఆవు పేడతో ఏం చేశాడంటే..?

కరీంనగర్ జిల్లాలో రెవెన్యూ అధికారుల తీరుపై విసుగు చెందిన ఓ వ్యక్తి వినూత్న రీతిలో ఆందోళకు దిగాడు.

Update: 2024-07-16 06:38 GMT

దిశ బ్యూరో, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో రెవెన్యూ అధికారుల తీరుపై విసుగు చెందిన ఓ వ్యక్తి వినూత్న రీతిలో ఆందోళకు దిగాడు. కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి ఆవు పేడ, ఖాళీ లిక్కర్ బాటిల్స్, పది రూపాయల నోట్లు విస్తరాకులో పెట్టుకుని అధికారుల తీరును ఎండగట్టే విధంగా నిరసన తెలిపాడు. తనకు వారసత్వంగా వచ్చిన భూమిని అమ్ముకునేందుకు అవకాశం ఇవ్వకపోవడంపై విసిగి వేసారి ఆందోళనకు దిగినట్లు తెలిపాడు. వివరాల్లోకి వెళితే కొత్తపల్లి మండలం రేకుర్తికి చెందిన దుర్గం మనోహర్‌కు వారసత్వంగా రావలసిన 21 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ధరణి వెబ్‌సైట్‌లో అన్ని రుసుములు చెల్లించిన కొత్తపల్లి ఎమ్మార్వో ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించాడు.

ఈ విషయమై కలెక్టర్‌ను సంప్రదించగా వారు ఆ ఫిర్యాదును ఆర్డీవోకు పంపించారన్నారు. ఆర్డీవో కూడా ఏం పట్టించుకోకుండా, నీవు మా రెవెన్యూ అధికారులపై ఫిర్యాదు చేస్తావా నీకు ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయను నీకు దిక్కు ఉన్న చోట చెప్పుకోపో అని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించాడు. గతంలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు, మున్సిపల్ అధికారుల అవినీతిపై మాట్లాడినందుకే నా భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా మానసికంగా హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసాడు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తనకు వారసత్వంగా రావలసిన భూమిని ఇప్పించాలని బాధితుడు కోరాడు. తన బాధ, అధికారుల తీరు జిల్లా కలెక్టర్ అర్థం చేసుకుని తనకు న్యాయం చేయాలని వినూత్న నిరసన తెలుపుతున్నా అని పేర్కొన్నాడు.


Similar News