టైమ్స్ స్క్వేర్ తరహాలో టీ-స్క్వేర్‌: మంత్రి సమక్షంలో డిజైన్ పదర్శన

న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ తరహాలో 24 గంటలూ సందర్శకులను ఆకట్టుకునేలా టీ-స్క్వేర్‌ను రూపొందించాలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ..

Update: 2024-10-24 16:13 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ తరహాలో 24 గంటలూ సందర్శకులను ఆకట్టుకునేలా టీ-స్క్వేర్‌ను రూపొందించాలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రాయదుర్గం కూడలిలో ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఐకానిక్ టైమ్స్ స్క్వేర్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను గురువారం సచివాలయంలో సమీక్షించారు. దీనిపై ఇప్పటికే టెండర్ ప్రకటన విడుదల కాగా పలు సంస్థలు తాము డిజైన్ చేసిన నిర్మాణాల ప్రెజెంటేషన్లను మంత్రి సమక్షంలో ప్రదర్శించాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారీ ఎలక్ట్రానిక్ డిస్పేలు, డిజిటల్ ప్రకటనలతో ఆ ప్రాంతమంతా వెలుగులు విరజిమ్మాలని అన్నారు. వ్యాపారం, వినోదం, పర్యాటకంతో సందర్శకులు ఉల్లాసంగా గడిపేలా సాంస్కృతిక ప్రదర్శనలు, గాయకుల సందడి ఉండాలని సూచించారు. 24 గంటలూ తెరిచి ఉండేలా యాంఫీ థియేటర్లు, ఓపెన్ రెస్టారెంట్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రత్యేక థీమ్‌తో కూడిన షాపింగ్ మాల్స్ ఉండాలని సూచించారు. సమీక్షా సమావేశంలో టీజీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ కె. శ్యామ సుందర్‌లు పాల్గొన్నారు.


Similar News