బాసరకు ట్రిపుల్‌ ఐటీకి హైకోర్టు నోటీసులు

బాసరలో ట్రిపుల్‌ ఐటీలో విద్యనభ్యసించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో బాసర ట్రిపుల్ ఐటీకి హైకోర్టు నోటీసులు జారీ చేసినట్లు పిటిషనర్ సామల ఫణి కుమార్ తెలిపారు.

Update: 2024-10-24 16:39 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : బాసరలో ట్రిపుల్‌ ఐటీలో విద్యనభ్యసించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో బాసర ట్రిపుల్ ఐటీకి హైకోర్టు నోటీసులు జారీ చేసినట్లు పిటిషనర్ సామల ఫణి కుమార్ తెలిపారు. విద్యార్థుల ఫీజులను ప్రభుత్వం చెల్లించనందుకు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వకుండా కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులకు గురి చేయడంతో సామల ఫణి కుమార్ అనే విద్యార్థి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. కాగా దీనిపై పిటిషనర్ తరఫున హైకోర్టు అడ్వకేట్ తక్కురి చందన వాదనలు వినిపించారు. ఫణి కుమార్ తో పాటు వేల మంది విద్యార్థులకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా యాజమాన్యం ఇబ్బందులకు గురిచేస్తోందని ఆమె కోర్టుకు వివరించారు.

వాస్తవానికి ట్రిపుల్‌ ఐటీలో సీటు వచ్చిన వాళ్లంతా ఉచిత విద్యను అభ్యసించడానికి హక్కు ఉందని ఆమె కోర్టుకు తెలిపారు. దానికి సంబంధించిన పూర్తి ఫీజు ప్రభుత్వమే భరించాలని చందన తన వాదనలు కోర్టుకు వినిపించారు. కాగా కోర్టు యాజమాన్యానికి నోటీసులు జారీ చేసినట్లు సామల ఫణి కుమార్ తెలిపారు. విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపడానికి వీల్లేదని తెలంగాణ హైకోర్టు గతంలో అనేక జడ్జిమెంట్లు ఇచ్చిందని, ఈ నేపథ్యంలోనే తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కి, ట్రిపుల్ ఐటీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే ఉన్నత విద్యామండలి ఈ అంశంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినట్లు తెలిపారు.


Similar News