పార్టీ ఫిరాయింపులకు ముఠా నాయకుడు పోచారంపై ఫైర్ అయిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

పార్టీ ఫిరాయింపులకు ముఠా నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు.

Update: 2024-10-24 14:56 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : పార్టీ ఫిరాయింపులకు ముఠా నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. గతంలో ఫిరాయింపులను ప్రోత్సహించి కాంగ్రెస్ పార్టీకి ఎల్వోపీ లేకుండా చేసిన చరిత్ర పోచారంకే దక్కుతుందని విమర్శించారు. భట్టి విక్రమార్క ప్రతిపక్ష నేత హోదా పోవడానికి కారణం పోచారం శ్రీనివాస్ రెడ్డి అని నొక్కి చెప్పారు. తిరిగి ఆయన్ను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడం ఏం సంకేతాన్ని ఇస్తుందని ఆయన ప్రశ్నించారు. గురువారం ఆయన అసెంబ్లీలోని సీఎల్పీలో మాట్లాడుతూ... పార్టీ ఫిరాయింపులు వద్దనే కేసీఆర్ పాలనను జనాలను తిరస్కరించారన్నారు. దీంతోనే కాంగ్రెస్ కు అధికారం వచ్చిందన్నారు. చట్టంలో కొన్ని లొసుగులు ఉండటం వలన ఫిరాయింపుల ప్రోత్సాహం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ విధానం ఫిరాయింపులకు వ్యతిరేకమని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక కొన్ని స్వార్థ శక్తులు అభివృద్ధి పేరుతో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారన్నారు. దీనివలన కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిపి 46 మంది ఎమ్మెల్యేలు అవుతారని, ఎంఐఎం బీజేపీని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ కలిచే ఛాన్స్ లేదన్నారు. దీంతో కాంగ్రెస్ కు ప్రజలు ఇచ్చిన సీట్లతోనే ప్రభుత్వాన్ని కొనసాగించే ఛాన్స్ ఉన్నదన్నారు. తప్పుడు ఫీడ్ బ్యాక్ లు ఇచ్చి ఫిరాయింపులు తప్పు చేసేలా కొందరు స్వార్థ నాయకులు చేసిన కుట్ర అంటూ మండిపడ్డారు. ఫిరాయింపుల అంశం తెరపైకి రావడం క్షేత్ర స్థాయిలో అసంతృప్తి ఉన్నదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడవ స్థానానికి పరిమితం అయిందన్నారు. పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ లోకి వచ్చినోళ్లు తమపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని మండిపడ్డారు. ఇదే అంశంపై ఏఐసీసీ, పీసీసీ అగ్రనాయకులకు జీవన్ రెడ్డి లేఖలు రాశారు.

శాసన మండలి లో 2019 నుంచి సభలో కేసీఆర్ పాలన, దౌర్జన్యాలపై ఒంటరి పోరాటం చేశానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు తో దశాబ్ద కాల ప్రజల కల నెరవేరిందన్నారు. కానీ ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకున్నారో? తెలియదన్నారు. జగిత్యాలలో కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి అనే గుర్తింపు తనకు ఉన్నదన్నారు. దాన్ని కొందరు కావాలనే తప్పించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గతంలో కేసీఆర్ కు వత్తాసు పలికినోళ్లే ఇప్పుడు కాంగ్రెస్ ముసుగు కప్పుకొని మళ్ళీ దౌర్జన్యాలు చేస్తామంటే.. తమ పార్టీ నేతలు కూడా వారికే పెద్దపీఠ వేయడంలో ఆంతర్యం ఏంటని అని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకుల పరిస్థితి ఎలా ఎంటుందో ఆలోచించాలన్నారు. ఇక తన అనుచరుడు గంగారెడ్డిని ఊర్లో కారుతో గుద్ది, 25 కత్తి పోట్లు పోడిచారన్నారు. ఆ హత్యతో తనకు సంబంధ లేదని స్వయంగా ఎమ్మెల్యే అన్నారని, కానీ తానేమీ ఆయన చేశాడని ఎక్కడా చెప్పలేదన్నారు. ఎవరి అండ చూసుకుని ఈ హత్య చేశారు? అని ప్రశ్నించారు.

ఉద్యమ నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలతో ఎమ్మెల్యేగా సంజయ్ కు అవకాశం వచ్చిందన్నారు. అభివృద్ధి జరగాలి అంటే పార్టీ మారాలి అనేది కరెక్ట్ కాదన్నారు. ఇదే నిజమైతే ప్రజాస్వామ్యం ఏం కావాలి.? అని నిలదీశారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని తాను కోరుకుంటున్నానని, పది నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ శ్రేణులు ఆవేదన, ఆందోళన పడుతున్నారన్నారు. అడ్డగోలుగా పార్టీలోకి గెలిచిన వారిని తీసుకువస్తాం అంటే, తమ పరిస్థితి ఏమిటో? అర్థం చేసుకోవాలన్నారు. పోచారం ప్రభుత్వ సలహాదారుడిగా ఉండి ఏం సలహాలు ఇస్తాడు? అంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దానం నాగేందర్ ఎంపీగా పోటీ చేయడం సరైన నిర్ణయామా? అంటూ నిలదీశారు. ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదని, కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదు అంటున్నాడని, మరి పది మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నట్లు అని? ప్రశ్నించారు. సంజయ్ పార్టీలో చేరినప్పుడు, చనిపోయిన గంగారెడ్డి పార్టీలో చేర్చుకోవద్దు అని కాళ్లు పట్టుకున్నాడని గుర్తు చేశారు.

పార్టీలో తనకు అవమానాలు జరుగుతుంటే ఏం చేయాలని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. భరిస్తూ బతకాలా? అంటూ సూచించారు. పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగానే ముందుకు వెళ్తున్నానని, తాను ఎక్కడా రూల్స్ బ్రేక్ చేయడం లేదన్నారు. ఫిరాయింపుల విషయంలో కేసీఆర్ ని ఆదర్శంగా తీసుకోవాలా? రాహుల్ గాంధీని తీసుకోవాలా? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ చెప్పినట్లు వినాల్సిన అవసరం ఉన్నదని, కానీ కేసీఆర్ తరహాలో పనిచేస్తే ఎట్లా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


Similar News