ప్రతిష్టాత్మక స్కిల్స్ యూనివర్శిటీ లక్ష్యం అదే..!

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్స్ యూనివర్శిటీలో కోర్సులు వచ్చే నెల 4 నుంచి ప్రారంభం కానున్నాయి.

Update: 2024-10-12 03:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్స్ యూనివర్శిటీలో కోర్సులు వచ్చే నెల 4 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం విద్యార్థులు ఈ నెల 29వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పరిశ్రమల శాఖ వెల్లడించింది. ప్రస్తుతానికి లాజిస్టిక్స్, ఈ-కామర్స్, హెల్త్ కేర్, ఫార్మాస్యూటికల్స్, లైఫ్ సైన్సెస్ విభాగాల్లో కోర్సులను యూనివర్శిటీ ఆఫర్ చేస్తున్నదని, రానున్న రోజుల్లో ఇతర విభాగాల్లోనూ ప్రకటిస్తుందని తెలిపింది. యువతకు నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా స్కిల్స్ యూనివర్శిటీ ద్వారా కోర్సులను నిర్వహిస్తుండగా ఆయా రంగాలకు చెందిన పరిశ్రమల యాజమాన్యం సాంకేతిక సాయాన్ని అందిస్తున్నాయి.

ఫ్యూచర్ సిటీ (ఫోర్త్ సిటీ)లో పర్మినెంట్ క్యాంపస్ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రారంభోత్సవం చేసినా భవనాల నిర్మాణాలకు మరింత సమయం పట్టనున్నది. దీంతో ఈ ఐదు రంగాల్లోని కోర్సులను రాయదుర్గంలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ప్రాంగణాన్ని తాత్కాలిక క్యాంపస్‌గా ఏర్పాటు చేసి నిర్వహించేలా వర్శిటీ పాలక మండలి నిర్ణయం తీసుకున్నది. ఇందుకోసం ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ రెండు భవనాలను యూనివర్శిటీ కోసం అప్పగించింది. ప్రాధాన్యత ఉన్న కోర్సులను తొలుత ప్రారంభించి ఆ తర్వాత వివిధ రంగాల్లో మరిన్ని కోర్సులను ఆఫర్ చేసేలా వర్శిటీ పాలక మండలి నిర్ణయం తీసుకున్నది.


Similar News