ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు.. పండుగపూట మంత్రి పొన్నం క్లారిటీ
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) పర్యటించారు.
దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) పర్యటించారు. శనివారం దసరా పండుగ సందర్భంగా ఎల్లమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక సర్వే కోసం జీవో 18 తీసుకొచ్చినట్లు తెలిపారు. 60 రోజుల పాటు ఈ సర్వే కొనసాగుతుందని అన్నారు. బీసీ కులగణన పూర్తి అయిన తర్వాత రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు(Gram Panchayat Elections) ఉంటాయని స్పష్టం చేశారు. 60 రోజుల పాటు జరిగే ఈ కులగణనకు రాష్ట్ర ప్రజలు అందరూ సహకరించాలని కోరారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా కులగణనపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం... 60 రోజుల్లో ప్రక్రియ పూర్తయ్యేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. రాష్ట్రంలోని ప్రతీ ఇంటినీ (కుటుంబాన్ని) కలిసి అందరి వివరాలను సేకరించేలా షెడ్యూలు ఖరారు చేసింది.
ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో జరిగే ఈ ప్రక్రియలో ప్రధానంగా ఐదు అంశాలపై (కులాన్ని కూడా కలిపితే ఆరు అంశాలు) దృష్టి పెట్టనున్నది. ఒకవైపు కులాలవారీగా వివరాలను సేకరించడంతో పాటు ఈ ఐదు అంశాలపైనా సమగ్రమైన డాటాను తీసుకోనున్నది. విద్య, ఉపాధి (ఉద్యోగ), సామాజిక, రాజకీయ, ఆర్థిక వెనకబాటుతనానికి సంబంధించిన వివరాలను కూడా సేకరించనున్నది. ప్రస్తుతం ఆయా కుటుంబాలకు లభిస్తున్న అవకాశాలను బేరీజు వేసుకుని భవిష్యత్తులో వారికి ప్రభుత్వం తరఫున కల్పించాల్సిన అవకాశాలపై నిర్ణయం తీసుకోడానికి ఈ డాటా ఉపయోగపడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ఓటర్లు ఎంత సంఖ్యలో ఉన్నారో తేల్చడంతో పాటు రాజకీయపరంగా వారి వెనకబాటుతనాన్ని అంచనా వేయడానికి ఈ సర్వే దోహదపడనున్నది.