పసుపు కు కేంద్రం మద్దతు ధర ఇవ్వాలి : సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి
గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పసుపు రైతులకు ఏనాడు పట్టించుకోలేదని, ప్రతిపక్షంలోకి రాగానే పసుపు రైతులపై దొంగ ప్రేమ ఒలకపోస్తుందని సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మండిపడ్డారు.

దిశ, తెలంగాణ బ్యూరో : గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పసుపు రైతులకు ఏనాడు పట్టించుకోలేదని, ప్రతిపక్షంలోకి రాగానే పసుపు రైతులపై దొంగ ప్రేమ ఒలకపోస్తుందని సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మండిపడ్డారు. బిఆర్ఎస్ హయాంలో పసుపు రైతులు ఆందోళన చేస్తే రోడ్లపైకి రాకుండా ఆంక్షలు పెట్టి ,కేసులు పెట్టి జైల్లో వేసిన చరిత్ర వారిదని గుర్తుచేశారు. మంగళవారం హాకా భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పసుపు రైతుల కోసం పనిచేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. వైఎస్ హయాంలోనే నిజామాబాద్ జిల్లాలో పసుపు పరిశోధన సంస్థ కోసం స్థలం కేటాయించారని, మద్దతు ధర లేకున్నా అప్పటి కేంద్ర ప్రభుత్వ అనుమతితో పసుపు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఆ సమయంలో అత్యధికంగా క్వింటాల్ కు రూ. 16 వేల ధర పలికిందని తెలిపారు. కానీ గత పాలకుల హయాంలో కేవలం రూ. 6 వేల నుండి రూ.7 వేల వరకే ధర వచ్చిందన్నారు. అధికారంలో ఉన్న సమయంలో పట్టించుకోని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు మాత్రం దొంగ ప్రేమ చూపుతున్నారని ఆరోపించారు.
వారు అధికారం కోల్పోయిన ఏడాది రూ. 12 వేలు ధర వచ్చిందని, కేంద్రం రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటుచేసినా మద్దతు ధర కల్పించలేకపోతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పసుపు క్వింటాల్ కు మోడల్ ధర రూ. 11 వేలు ధర పలుకుతోందని, ఈ ధర కూడా సరిపోదని ఇంకా ధర పెరగాలన్నారు. ధర రాకపోడానికి ప్రధానంగా వ్యాపారస్తులు సిండికేట్ కావడమేనని, ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆదేశాలతో నిజామాబాద్ జిల్లాలో పర్యటించానని తెలిపారు. ఇప్పటికే పసుపును నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలి అని మంత్రి తుమ్మల, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ గా తాను కేంద్రానికి లేఖ రాసినట్లు వెల్లడించారు. పసుపులో తేమ శాతం చూసే మిషన్ లు లేవని, ధరపడిపోకుండా చూడాలని కోరారు. మిగతా పంటలకు మద్దతు ధర ఉన్నట్లే పసుపుకు మద్దతు కల్పించాలన్నారు. ఎంఎస్పీ జాబితాలో పసుపు పంటను చేర్చితేనే మద్దతు ధర వస్తుందన్నారు. మొన్నటి వరకు వాణిజ్య పంటలు మిర్చి, పసుపు ఉండేవని ప్రస్తుతం వాటిని ఎస్సీడిఎక్స్నుండి మిర్చిని తీసేశారు. అదేవిదంగా ఎస్సీడీఎక్స్లో నుండి పసుపును తీసేలా సూచించారు.