TG: ఊపందుకోనున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేసుకున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకానికి బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేసుకున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకానికి బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించింది. ఏటా నాలుగు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. ఆ మేరకు భారీగా నిధులను ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఏకంగా రూ.12,571 కోట్లను కేటాయిస్తున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల నిర్మాణం ఊపందుకోనుంది.
గతంకంటే ఎక్కువే..
2024-25 సంవత్సరానికి గాను గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టగా.. అందులో ఇందిరమ్మ ఇళ్లకు రూ.9,184 కోట్లను కేటాయించారు. ఈసారి దానిని మరింత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. గతంకంటే రూ.3,387 కోట్లు అదనంగా కేటాయించడం గమనార్హం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది గుడ్‌న్యూస్ అయింది.
మొన్నటివరకు ఎన్నికల కోడ్ అడ్డంకి
కాగా.. మొన్నటివరకు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఇటీవల ఆ కోడ్ కూడా ముగియడంతో ఇక ఇళ్ల నిర్మాణం ఊపందుకోనుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 72వేల మంది వరకు లబ్ధిదారులను ఎంపిక చేయగా.. వారికి జనవరి 26న మంజూరు పత్రాలు ఇచ్చారు. అందులో నుంచి పలు ఇళ్ల నిర్మాణాలు సైతం ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. అయితే.. రెండో విడత కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నది. ఎట్టకేలకు బడ్జెటులో కూడా భారీగా కేటాయింపులు జరగడంతో ఈ ప్రక్రియను మరింత వేగవంతంగా చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. అనుకున్న సమయంలోగా లబ్ధిదారులను ఎంపిక చేసి.. వారికి ఇళ్లను కేటాయించాలని.. నిర్ణీత గడువు లోగా నిర్మాణాలు సైతం పూర్తిచేయాలని ఇప్పటికే ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖ అధికారులను సైతం ఆదేశించింది. కాగా.. ఏటా ఒక్కో నియోజకవర్గంలో 3,500 ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయడాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఓవరాల్‌గా ఏటా 4 లక్షల ఇళ్లను నిర్మించాలని భావిస్తున్నది.