భారత్, ఫిజి దేశాల మధ్య బంధం మరింత బలోపేతం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

భారత్, ఫిజి దేశాల మధ్య బంధం మరింత బలపడనుంది. పర్యాటకం, సాంస్కృతిక రంగంలో రెండు దేశాల మధ్య పరస్పర ఒప్పందం జరిగింది. హైదరాబాద్ తాజ్

Update: 2024-01-17 14:26 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: భారత్, ఫిజి దేశాల మధ్య బంధం మరింత బలపడనుంది. పర్యాటకం, సాంస్కృతిక రంగంలో రెండు దేశాల మధ్య పరస్పర ఒప్పందం జరిగింది. హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్‌లో బుధవారం కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఫిజి దేశ ఉప ప్రధాని, ఆ దేశ పర్యాటక శాఖ మంత్రి విలియమ్ గవోకా భేటీ అయ్యారు. ఇరు దేశాల నడుమ ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. కాగా ఇందులో.. భారత్, ఫిజి దేశాల మధ్య పర్యాటకాన్ని, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం తదితర అంశాలపై వారు చర్చించారు. ఇదిలా ఉండగా ఫిజి దేశ ఉప ప్రధాని విలియమ్ గవోకాను కిషన్ రెడ్డి సన్మానించారు.

ఇదిలా ఉండగా అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయాలు, పుణ్యక్షేత్రాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలనే ప్రధాని మోడీ పిలుపు మేరకు బషీర్ బాగ్ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆలయాల స్వచ్ఛత చేపట్టారు. ఆలయ పరిసరాలను ఊడ్చారు. నీటితో ఆలయ గోపురాల్ని కడిగారు. అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 500 ఏండ్ల హిందువుల ఆకాంక్ష ఈనెల 22వ తేదీన నేరవెరబోతోందని ఆయన చెప్పారు. ఈ మహా ఘట్టం కోసం ప్రపంచంలోని కోట్లాది మంది హిందువులు ఎదురుచూస్తున్నారన్నారు. ప్రజలు కూడా స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని పుణ్యక్షేత్రాలను శుభ్రం చేయాలని పిలుపునిచ్చారు.

కఠోరమైన ఉపవాస దీక్ష చేస్తున్న ప్రధాని మోడీకి యావత్ సమాజం మద్దతునివ్వాలని కోరారు. యావత్ దేశమే కాదు ప్రపంచంలోని హిందువులందరూ ప్రత్యక్షంగా, పరోక్షంగా లైవ్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని చెప్పారు. ప్రజలు తమ ఇండ్లను, ప్రతి దేవాలయాన్ని అలంకరించాలని, ఇంట్లో, దేవాలయాల్లో దీపాలను వెలిగించాలని కిషన్ రెడ్డి కోరారు. దేవాలయాల్లో నిర్వహించే మహా హారతి కార్యక్రమంలో పాల్గొనాలని, ప్రసాద వితరణ కార్యక్రమన్ని చేపట్టాలని కిషన్ రెడ్డి కోరారు.

Tags:    

Similar News