ఆ కుటుంబానికే 20 గిన్నిస్ రికార్డులు

Update: 2024-10-06 08:34 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఏదో ప్రత్యేకత..ప్రతిభ లేక సాహసం ఉంటేనే సాధించే గిన్నిస్ బుక్ రికార్డులు ఆ కుటుంబానికి మాత్రం సాధారణ ఫీట్స్ గా మారిపోయాయి. గీతం యూనివర్సిటీ పూర్వ విద్యార్థులైన శివాలి జోహ్రీ శ్రీవాస్తవ, ఆమె తల్లిదండ్రులు కవితా జోహ్రీ శ్రీవాస్తవ, అనిల్ శ్రీవాస్తవల కుటుంబం ఏకంగా 20గిన్నిస్ ప్రపంచ రికార్డులు సాధించి చరిత్ర సృష్టించారు. హైదరాబాద్ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం బీటెక్ పూర్వ విద్యార్థిని (2016-20) శివాలి జోహ్రి శ్రీవాస్తవ, ఆమె తల్లి కవిత జోహ్రి శ్రీవాస్తవ, తండ్రి అనిల్ శ్రీవాస్తవలు మూడు 18, 19, 20వ గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించారు. 3,100 ఒరిగామి నెమళ్లు, 1,100 ఒరిగామి చొక్కాలు, 3,200 ఒరిగామి పందుల బొమ్మలను ఒకేచోట ఉంచిన ఈ కుటుంబం అతి పెద్ద ప్రదర్శనగా రికార్డు నెలకొల్పారు.

అంతకు ముందు శివాలి కుటుంబం చేతితో తయారుచేసిన కాగితపు బొమ్మలు, క్విల్డ్ పువ్వులు, ఒరిగామి వేల్స్ పెంగ్విన్లు, సిట్రస్ పండ్లు, మాపుల్ ఆకులు, కుక్కలు, రాక్షస బల్లులు.. మరికొన్నింటితో సహా వివిధ ప్రదర్శనలతో 17 గిన్నిస్ ప్రపంచ రికార్డులను నెలకొల్పారు. ఆయా గిన్నిస్ రికార్డులతో పాటు 15 అసిస్ట్ వరల్డ్ రికార్డ్, 10 యూనిక్ వరల్డ్ రికార్డులను శివాలి కుటుంబం ఖాతాలో ఉండటం విశేషం. మొత్తం 20 గిన్నిస్ రికార్డులను సాధించిన శివాలి, ఆమె తల్లిదండ్రులను గీతం హైదరాబాద్ అదనపు ఉపకుల పతి ప్రొఫెసర్ డీఎస్. రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.ఆర్.శాస్త్రి, అసోసియేట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్. సీతారామయ్య, గణిత విభాగం అధ్యాపకుడు డాక్టర్ మల్లికార్జున్, వివిధ విభాగాధిపతులు అభినందించారు.


Similar News