వీఆర్వోల నియామకంపై సీఎంతో చర్చిస్తా : మంత్రి పొంగులేటి

రాష్ట్రంలో 10 వేల 954 రెవెన్యూ గ్రామాలు ఉండగా ఒక్కో రెవెన్యూ గ్రామానికి ఒక జూనియర్ రెవెన్యూ అధికారి లేక వీఆర్వోలను నియమించాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు..

Update: 2024-10-06 11:23 GMT

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో 10 వేల 954 రెవెన్యూ గ్రామాలు ఉండగా ఒక్కో రెవెన్యూ గ్రామానికి ఒక జూనియర్ రెవెన్యూ అధికారి లేక వీఆర్వోలను నియమించాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయని  రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు..  దీంతో పాటు రెవెన్యూ ఉద్యోగులు కోరుతున్న ఇతర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.  రాష్ట్రంలోని డిప్యూటీ కలెక్టర్లు, 257 రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ అధికారులు, 970 తహసీల్దార్లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుందన్నారు. గ్రామస్థాయిలో రెవెన్యూ సేవలు అందించేందుకు గ్రామ రెవెన్యూ అధికారి వీఆర్వో, గ్రామ రెవెన్యూ సహాయకులు వీఆర్‌ఏ వ్యవస్థలు కలిపి రాష్ట్రంలో 25 వేలకు పైగా పోస్టులు ఉండేవని, బీఆర్​ఎస్​ ప్రభుత్వం వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థలను పూర్తిగా రద్దు చేయగా.. వారిని ఇతర శాఖలకు బదలాయించిందని, ఫలితంగా గ్రామస్థాయిలో అనేక సమస్యలు ఎదురైనట్లు ప్రభుత్వం గుర్తించిందన్నారు.

గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ పటిష్ఠ పర్చడంలో భాగంగా సిబ్బంది నియామకానికి నిర్ణయంపై సీఎంతో చర్చిస్తామన్నారు. ధరణి స్థానంలో త్వరలో కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొస్తుందన్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా ఈ చట్టం దేశంలోనే ఆదర్శంగా ఉండబోతుందన్నారు. నూతన చట్టం అమలు దిశగా అధికారుల నుంచి సూచనలు, సలహాలు ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. భూములు ఉన్న ప్రతి ఒక్క ఆసామికి భరోసా ఇవ్వాలన్నదే ప్రభుత్వం ఆలోచన అని వివరించారు. రాబోయే రోజుల్లో ప్రజలకు మంచి పాలన ఇచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. 


Similar News