బీఆర్ఎస్ పార్టీ గాడిదలాంటిది : సీఎం రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ పార్టీ మీద సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ పార్టీ మీద సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు శిల్పకళావేదికలో 1473 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు విద్యార్థుల, నిరుద్యోగుల బలిదానాల వలన ఏర్పడింది కానీ బీఆర్ఎస్ వల్ల కాని కేసీఆర్ కుటుంబం వల్ల గాని కాదన్నారు. ఆ పార్టీ గాడిద వంటిదని పొలుస్తూ.. దానికి సంబంధించిన ఓ చిన్న కథను చెప్పారు. 'పూర్వకాలంలో శ్రీరాముని పరిపాలన కాలంలో ఓ చాకలి అతని దగ్గర ఓ గాడిద ఉండేది. ఆ చాకలి దాని వీపుమీద వేసే మూట మీద శ్రీరాముని బొమ్మ వేయించాడు. ఆ గాడిద వీపు మీద శ్రీరాముని బొమ్మను చూసిన ఆ ఊర్లో ప్రజలు చేతులెత్తి మొక్కుతుంటే.. ఆ గాడిద నాకే వీళ్ళంతా మొక్కుతున్నారని భ్రమపడింది. అలా అది ఎక్కడికి వెళ్ళినా ఎవరూ ఏమీ అనకపోగా.. దానికి గర్వం పెరిగి పోయింది. ఒకరోజు చేనులో పడి మేస్తుండగా.. శ్రీరాముని బొమ్మ చూసి ముందు ఏమీ అనని ఆ చేను రైతు.. ఆ కాసేపటికి ముళ్ళ చెట్టు తగిలి గాడిద మీద బొంత పక్కకి తొలగడంతో వచ్చి దుడ్డుకర్రతో వీపు పగల గొట్టాడు. అలాగే తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకున్నన్ని రోజులు ప్రజలు కేసీఆర్ కు దండం పెట్టారు. ఎప్పుడైతే తెలంగాణ భావన వదిలి, అన్నీ తానే చేశానని చెప్పుకుంటూ, అహంకారంతో విర్రవీగడం మొదలు పెట్టాక ప్రజలు చావు దెబ్బ తీశారు' అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. దీంతో సభలో ఉన్నవారంత రేవంత్ రెడ్డి భలే చెప్పారు అని చప్పట్లు, విజిల్స్ వేస్తూ.. సీఎంను పొగిడారు.