ఇంటికి చేరిన జైనూర్ బాధిత మహిళ..నూతన వస్త్రాలు బహుకరించిన సీతక్క

Update: 2024-10-06 10:04 GMT

దిశ, వెబ్ డెస్క్ : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఆటో డ్రైవర్ దాడిలో తీవ్రంగా గాయపడి, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ ఆదివాసీ మహిళ పూర్తిగా కోలుకోవడంతో ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. గత నెల రోజులుగా గాంధీ ఆసుపత్రిలో బాధిత మహిళకు వైద్య చికిత్సలు అందిస్తున్నారు. బాధిత మహిళకు ఇన్ని రోజులుగా అందుతున్న వైద్య సహాయాన్ని పర్యవేక్షిస్తు వచ్చిన మంత్రి సీతక్క ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు. ఇంటికి వెలుతున్న బాధిత మహిళకు మంత్రి సీతక్క నూతన వస్త్రాలు, నగదు బహుకరించారు. డిశ్చార్జ్ సందర్భంగా భావోద్వేగ వాతావరణం నెలకొంది. తమ పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకున్న మంత్రి సీతక్కకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఆదివాసి ఆడబిడ్డపై దాడి జరిగిందని తెలియగానే ప్రభుత్వం వెంటనే స్పందించిందని గుర్తు చేశారు. బాధితురాలికి అండగా నిల్చామని, ఆమెను అన్ని విధాలుగా ఆదుకుంటామని వివరించారు. మంత్రి వెంట కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణ, డిసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావులు ఉన్నారు. 


Similar News