పూలనే దేవతలా పూజించే పండుగ.. ‘బతుకమ్మ’ను అధికారికంగా గుర్తించిన అమెరికా!

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబంగా ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకగా నిలిచే పండుగ బతుకమ్మ.

Update: 2024-10-06 11:09 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబంగా ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకగా నిలిచే పండుగ బతుకమ్మ. రంగురంగుల పూలతో తాంబాలంలో బతుకమ్మను పేర్చి.. బతుకమ్మ చుట్టూ చప్పట్లు కొడుతూ వలయంగా తిరుగుతూ మహిళలు బతుకమ్మ పాటలు పాడుతారు. తొమ్మిది రోజుల పాటు పూలనే దేవతలా కొలిచే పండుగ ప్రసిద్ధి చెందింది బతుకమ్మ. అయితే మన బతుకమ్మ పండుగను ఇక్కడే కాకుండా విదేశాల్లోనూ తెలుగు ప్రజలు ఘనంగా నిర్వహించుకునే విషయం తెలిసిందే. తెలుగు వాళ్ళు అధికంగా నివసించే న్యూయార్క్, న్యూ జెర్సీ, టెక్సాస్, చికాగో, నార్త్ కరోలినా, కాలిఫోర్నియా, వర్జినియా, ఒహాయో, జార్జియా ఫ్లోరిడా, మొదలకు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహిస్తుంటారు.

ఈ క్రమంలోనే తాజాగా అమెరికాలో మన బతుకమ్మ పండుగకు అరుదైన గుర్తింపు లభించింది. అమెరికాలోని కొన్ని ప్రాంతాలు బతుకమ్మ పండుగను అధికారికంగా గుర్తించి.. వారోత్సవాలను ప్రకటించాయి. బతుకమ్మ ఉత్సవాల వారాన్ని అధికారికంగా బతుకమ్మ పండగ వారం, తెలంగాణ హెరిటేజ్ వీక్‌గా అమెరికాలోని నార్త్ కరోలినా, జార్జియా, చార్లెట్‌ నగరం, వర్జీనియా రాష్ట్రాలు ప్రకటించాయి. ఈ మేరకు ఆయా ప్రాంతాల మేయర్‌, గవర్నర్‌లు అధికార ప్రకటనలు విడుదల చేశారు. కాగా, బతుకమ్మకు గుర్తింపు రావడంపై తెలుగు ఎన్నారైలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 


Similar News