Khammam : సంక్షేమ హాస్టల్లో గ్యాంగ్ వార్! జూనియర్, సీనియర్ విద్యార్థుల మధ్య ఘర్షణ
ఓ ఎస్సీ సంక్షేమ బాలుర హాస్టల్‌లో గ్యాంగ్ వార్ చోటుచేసుకుంది.
దిశ, డైనమిక్ బ్యూరో: ఓ ఎస్సీ సంక్షేమ బాలుర హాస్టల్‌లో గ్యాంగ్ వార్ చోటుచేసుకుంది. రాత్రి పది గంటల తర్వాత వచ్చిన ఓ జూనియర్ విద్యార్థిని సీనియర్ విద్యార్థులు అడ్డుకోవడంతో సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య వివాదం చెలరేగింది. ఇది కాస్త ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే దాకా వచ్చింది. ఖమ్మం నగరంలోని ఎస్సీ సంక్షేమ హాస్టల్‌లో మంళవారం రాత్రి మద్యం తాగి వచ్చాడని జూనియర్ వేణు అనే విద్యార్థిని హాస్టల్ లోకి అనుమతించ లేదు. దీంతో సదరు విద్యార్థి గురువారం ఉదయం తన స్నేహితులతో కలిసి వసతిగృహానికి వచ్చి రాత్రి తనను అడ్డుకున్న విద్యార్థులపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరిద్దరికి గాయాలైనట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై ఎస్సీ సంక్షేమ శాఖ డీడీ సత్యనారాయణ విచారణ చేపట్టారు.
రాత్రి వేళ మద్యం తాగి రావడంతో జూనియర్‌ను అడ్డుకున్నామని, దీంతో తమపై కక్ష్యతో దాడి చేయించినట్లు సీనియర్ విద్యార్థులు అధికారులకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే వేణుపై హాస్టల్ విద్యార్థులు బుధవారం రాత్రి టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే, బయటనుంచి వ్యక్తులను తీసుకొచ్చి గొడవకు దిగిన వేణు అడ్మిషన్ రద్దు చేసి.. పంపించినట్లు డీడీ తెలిపారు. క్రమశిక్షణ పాటించని విద్యార్థుల అడ్మిషన్ రద్దు చేస్తామని ఆయన పేర్కొన్నారు. కాగా, కర్రలతో దాడి చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.