మూడు గంటల వ్యవధిలో పది మంది మంత్రులు.. సచివాలయంలో కోలాహలం

మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన పదకొండు మంది మంత్రుల్లో ఇద్దరు మాత్రమే సచివాలయంలో బాధ్యతలు తీసుకోగా మిగిలినవారంతా గురువారం ఉదయం ఎంటర్ కావడానికి ముహూర్తాలను ఖరారు చేసుకున్నారు.

Update: 2023-12-13 11:15 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన పదకొండు మంది మంత్రుల్లో ఇద్దరు మాత్రమే సచివాలయంలో బాధ్యతలు తీసుకోగా మిగిలినవారంతా గురువారం ఉదయం ఎంటర్ కావడానికి ముహూర్తాలను ఖరారు చేసుకున్నారు. ఉదయం 7.00 గంటల నుంచి పది గంటల మధ్యలో మూడు గంటల వ్యవధిలోనే తొమ్మిది మంది మంత్రులు లాంఛనంగా వారి ఛాంబర్లలోకి ప్రవేశిస్తున్నారు. ఇప్పటివరకు రివ్యూ మీటింగుల్లో పాల్గొన్నప్పటికీ అధికారికంగా వారి చాంబర్లలో సీట్లలో కూర్చోలేదు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రమే పూజల అనంతరం వారి చాంబర్లలో బాధ్యతలు తీసుకుని సీట్లలో ఆశీనులయ్యారు. కానీ మిగిలిన వారంతా గురువారం ఉదయం ఆ ప్రాసెస్‌ను కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నారు.

ఒకేసారి తొమ్మిది మంది ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకోవడంతో సచివాలయం ప్రాంగణంలో సందడి నెలకొన్నది. మంత్రుల కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు అనుచరులు, కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమాలకు హాజరు కానున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రద్దీ ఏర్పడుతుందని సెక్యూరిటీ సిబ్బంది అంచనా వేశారు. దీంతో సెక్రెటేరియట్ ప్రాంగణం మొత్తం కోలాహలంగా మారింది. మంత్రుల చాంబర్ల ప్రవేశద్వారాలకు పూలమాలల అలంకరణ జరుగుతున్నది. మంత్రుల పేర్లతో నేమ్ బోర్డులు అమర్చడం కూడా మొదలైంది. లాంఛనంగా ఛాంబర్లలోని వారి స్థానాల్లో ఆశీనులై బాధ్యతలు తీసుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు.


Similar News